భారత్‌లో కరోనా మహమ్మారి పంజా విసురుతోంది. దేశంలో క్రమ క్రమంగా వైరస్‌ కేసులు పెరగడం ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా 3,577 కేసులు నమోదయ్యాయి. మృతుల సంఖ్య 83కు చేరిందని ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది.

తాజాగా మధ్య ప్రదేశ్‌లో ఓ వ్యక్తి ఇచ్చిన విందులో 10 మందికి కరోనా వైరస్‌ పాజిటివ్‌ అని తేలడం తీవ్ర కలకలం సృష్టిస్తోంది. రాష్ట్రంలోని మురేనా నగరానికి చెందిన వ్యక్తి దుబాయ్‌లోని ఓ హోటల్‌లో పని చేసేవాడు. తల్లి చనిపోవడంతో మార్చి నెల 17న భారత్‌కు వచ్చాడు. తల్లి మృతికి సంతాపంగా మార్చి 20 న విందు ఏర్పాటు చేశాడు. సంప్రదాయబద్ధంగా జరిగిన ఈ విందులో సుమారు 1200 మంది హాజరయ్యారు. ఆ తర్వాత వ్యక్తి, అతని భార్య మార్చి 27 తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వెంటనే ఆస్పత్రికి వెళ్లి పరీక్షలు చేయించుకున్నారు. మొదటగా తాను దుబాయ్‌ నుంచి వచ్చిన వివరాలను అధికారులకు అతడు తెలియజేయలేదు. కరోనా లక్షణాలు కనిపించిన తర్వాత ఈ వివరాలను బయటపెట్టాడు.

ఈ నెల 2వ తేదీన భార్యభర్తలిద్దరికీ కరోనా పాజిటివ్‌ అని తేలింది. విందులో పాల్గొన్న మరో 10 మందికి కరోనా వైరస్‌ సోకినట్లు నిర్దారణ అయ్యింది. దీంతో మధ్య ప్రదేశ్‌ అధికారులు అప్రమత్తం అయ్యారు. విందుకు హాజరైన వారితో పాటు, వారితో సన్నిహితంగా ఉన్న దాదాపు 26 వేల మంది ఇళ్ల క్వారంటైన్‌లో ఉంచారు. మధ్యప్రదేశ్‌లో 179 కరోనా పాజిటివ్‌ కేసులు ఉన్నాయి.

అంజి గోనె

నా పేరు గోనె. అంజి. న్యూస్‌మీటర్‌ తెలుగులో జర్నలిస్టుగా పని చేస్తున్నాను. గతంలో 99టీవీలో క్షేత్రస్థాయి అధ్యయనం చేశాను. మోజో టీవీలో సంవత్సరం పాటు జర్నలిస్టుగా పనిచేశాను. కలం నా బలం, సమస్యలే నా గళం. జర్నలిజం పట్ల ఇష్టంతో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.