మధ్యప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం

By సుభాష్  Published on  18 Aug 2020 8:04 PM IST
మధ్యప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం

మధ్యప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఛతర్‌పూర్‌ సాగర్‌ - కాన్పూర్‌ జాతీయ రహదారిపై కారు, ట్రక్కు ఢీకొనడంతో ముగ్గురు మృతి చెందగా, మరో ఇద్దరు పిల్లలు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడ్డ వారిని చికిత్స నిమిత్తం జిల్లా ఆస్పత్రికి తరలించారు. మృతుల్లో భార్యాభర్తలతో పాటు మరో వ్యక్తి ఉన్నారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మహారాజ్‌పూర్‌ తహసీల్‌ ప్రాంతంలో సింగ్సూర్‌ గ్రామంలో నివాసం ఉంటున్న జంగ్‌బహదూర్‌ సింగ్‌ రాజ్‌పుత్‌, తన భార్య, ఇద్దరు పిల్లలతో కలిసి రోహిత్‌ తివారీ అనే వ్యక్తితో కలిసి కారులో చిత్రకూట్‌ ధామ్‌ వెళ్లేందుకు బయలుదేరారు. సోమవారం సాయంత్రం వరకు చిత్రకూట్‌ను దర్శనం చేసుకుని అనంతరం అదే రోజు రాత్రి తిరుగు ప్రయాణం అయ్యారు.

మంగళవారం గారిమల్‌హారా దాటిన తర్వాత ఓ జంతువును రక్షించే ప్రయత్నంలో ఎదురుగా వస్తున్న ట్రక్కును ఢీకొట్టారు. ఈ ఘటనలో జంగ్‌బహదూర్‌ సింగ్‌, అతని భార్య విశాఖ, రోహిత్‌ తివారీలు సంఘటన స్థలంలోనే మృతి చెందారు. వారి పిల్లలు ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాద విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపడుతున్నట్లు పోలీసులు తెలిపారు.

Next Story