Year Ender 2024 : ఆ ఇద్ద‌రు రెజ్లర్ల‌కు ఇది మ‌ర్చిపోలేని ఏడాది..!

ఈ ఏడాది జూలై-ఆగస్టులో నిర్వహించిన పారిస్ ఒలింపిక్స్‌లో చాలా వివాదాలు చోటు చేసుకున్నాయి.

By Medi Samrat  Published on  17 Dec 2024 11:31 AM GMT
Year Ender 2024 : ఆ ఇద్ద‌రు రెజ్లర్ల‌కు ఇది మ‌ర్చిపోలేని ఏడాది..!

ఈ ఏడాది జూలై-ఆగస్టులో నిర్వహించిన పారిస్ ఒలింపిక్స్‌లో చాలా వివాదాలు చోటు చేసుకున్నాయి. వాస్తవానికి మహిళల 50 కిలోల విభాగంలో భారత రెజ్లర్ వినేష్ ఫోగట్ ఫైనల్‌కు చేరుకుంది. పతకం ఖాయమైంది. కానీ ఫైనల్ బౌట్‌కు ముంతు ఆమె అధిక బరువు కలిగి ఉంద‌ని అనర్హత వేటుపడింది. దాని కారణంగా ఆమె పతకాన్ని కోల్పోయింది. దీంతో తొలి బంగారు పతకం వినేష్‌కే దక్కుతుందని అందరు పెట్టుకున్న ఆశ‌లు ఒక్కసారిగా బద్దలయ్యాయి.

వినేష్ సెమీ-ఫైనల్స్‌లో క్యూబాకు చెందిన లోపెజ్ గుజ్మాన్‌ను 5-0తో ఓడించి ఒలింపిక్స్‌లో ఫైనల్‌కు చేరిన తొలి మహిళా రెజ్లర్‌గా నిలిచింది. అమెరికా క్రీడాకారిణి సారా ఆన్ హిల్డెబ్రాండ్‌తో వినేష్ ఫైనల్‌లో తలపడాల్సి ఉండగా.. అధిక బరువు కారణంగా వినేష్ పతకం సాధించాలనే కల చెదిరిపోయింది. ఈ నిర్ణయంపై వినేష్ స్పోర్ట్స్ ట్రిబ్యునల్‌లో కూడా అప్పీల్ చేశారు.. అయితే ఆమె అప్పీల్ తిరస్కరించబడింది.

ఫైనల్ బౌట్‌కు ముందు ఉదయం వినేష్ బరువు నిర్దేశించిన పరిమితి కంటే 100 గ్రాములు ఎక్కువగా ఉన్నట్లు తేలింది. ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా రెజ్లర్ కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్‌లో అప్పీల్ చేసింది. క్యూబన్ రెజ్లర్ యుస్నెలిస్ గుజ్మాన్ లోపెజ్‌తో కలిసి ఆమెకు ఉమ్మడి రజత పతకాన్ని ప్రదానం చేయాలని డిమాండ్ చేసింది. లోపెజ్ సెమీ-ఫైనల్స్‌లో వినేష్ చేతిలో ఓడిపోయింది. అయితే భారత రెజ్లర్ వినేష్ అనర్హురాల‌ని తర్వాత ఫైనల్‌లో చోటు దక్కించుకుంది. వినేష్ డిమాండ్‌ను స్పోర్ట్స్ కోర్టు కూడా అంగీకరించలేదు.

ఈ వివాదం ప్రభావం త‌ర్వాత‌ రెజ్లర్ వినేష్ ఫోగట్ అందరినీ ఆశ్చర్యపరిచింది. ఆమె రిటైర్మెంట్ ప్రకటించింది. ఈ విషయాన్ని ఆమె సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్ట్ ద్వారా ప్రకటించింది. ఒలింపిక్స్‌లో పతకం కోల్పోవడం, వివాదాలు రావడంతో వినేష్ రాజకీయాల్లోకి రావాలని నిర్ణయించుకుంది. ఈ ఏడాది జరిగిన హర్యానా అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీలో చేరి జులనా నుంచి గెలుపొంది ఎమ్మెల్యే అయ్యారు. మ‌రో రెజ్ల‌ర్‌ బజరంగ్ పునియా కూడా కాంగ్రెస్‌లో చేరారు కానీ అతనికి అదృష్టం క‌లిసిరాలేదు.

భారత రెజ్లర్ బజరంగ్ పునియాకు ఈ ఏడాది బాగాలేదు. మొదట అతడు ఒలింపిక్స్‌కు అర్హత సాధించలేకపోయాడు. ప్రాక్టీస్ క్యాంప్‌ల సమయంలో డోప్ టెస్ట్ కోసం నమూనాలను అందించడంలో విఫలమైనందుకు నాలుగేళ్ల పాటు నిషేధించబడ్డాడు. టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్య పతకాన్ని గెలుచుకున్న తర్వాత.. అతని కెరీర్ గ్రాఫ్ ఈ సంవత్సరం పూర్తిగా పడిపోయింది.

Next Story