Lookback Politics: 2024లో జనసేన సంచలనం.. పార్టీకి ఈ ఏడాది ఎంతలా కలిసొచ్చిందంటే?
ఈ ఏడాది జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన పార్టీ గెలుపు.. దేశంలోని రాజకీయాలకు ఓ కేస్ స్టడీగా మారిందనే చెప్పాలి.
By అంజి
Lookback Politics: 2024లో జనసేన సంచలనం.. పార్టీకి ఈ ఏడాది ఎంతలా కలిసొచ్చిందంటే?
ఈ ఏడాది జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన పార్టీ గెలుపు.. దేశంలోని రాజకీయాలకు ఓ కేస్ స్టడీగా మారిందనే చెప్పాలి. ఎందుకంటే.. పార్టీ స్థాపితమైన 10 ఏళ్ల తర్వాత మొట్టమొదటిసారిగా ఆ పార్టీ అధినేత ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అలాగే ఆ పార్టీ తరఫున నిలబడ్డ మొత్తం అభ్యర్థులు కూడా విజయం సాధించారు. ఎన్నికల్లో జనసేన 100కు 100 శాతం స్ట్రైక్ రేట్ సాధించింది. పిఠాపురం శాసనసభ స్థానం నుంచి 70,354 ఓట్ల మోజారిటీతో గెలిచిన జనసేన అధినేత పవన్ కల్యాణ్ తోలిసారి శాసనసభలో అడుగు పెట్టారు. దీన్ని బట్టి చూస్తే.. 2024 సంవత్సరం జనసేనకు బాగా కలిసొచ్చిందనే చెప్పాలి.
జనసేన పార్టీని తెలుగు సినీ నటుడు, ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ 2014 లో స్థాపించారు. అప్పటి నుంచి దాదాపు 10 ఏళ్లుగా రాజకీయాల్లో ఎన్నో అటుపోట్లను ఎదుర్కొంటూ జనసేన ముందుకు సాగింది. 2014లో జరిగిన ఎన్నికల్లో నేరుగా పోటీ చేయని జనసేన.. ఇతర పార్టీలకు తన మద్దతు ప్రకటించింది. అయితే 2019 ఎన్నికల్లో కమ్యూనిస్టు పార్టీలతో పాటు బీఎస్పీతో పొత్తు పెట్టుకొని, 160కు పైగా స్థానాల్లో పోటీచేసిన జనసేన పెద్దగా రాణించలేకపోయింది. కేవలం ఒక సీటు మాత్రమే గెలుచుకోగలింది. పవన్ కళ్యాణ్ గాజువాక, భీమవరం రెండు అసెంబ్లీ స్థానాల నుంచి పోటీచేసి ఓడిపోయారు. అయితే 2024 ఎన్నికల్లో మాత్రం అలా జరగలేదు.
టీడీపీ, బీజేపీతో పొత్తు పెట్టుకుని 21 సీట్లకు గాను 21 సీట్లు గెలిచింది. మొత్తంగా ఎన్నికల్లో 100 శాతం స్ట్రైక్ రేట్ సాధించి.. అసెంబ్లీ ఎన్నికల్లో సంచలనం సృష్టించింది. గత అధికార వైసీపీ సాధించిన సీట్ల కంటే రెట్టింపు సీట్లు గెలిచింది. వైసీపీ 175 స్థానాల్లో పోటీ చేసి కేవలం 11 స్థానాలకే పరిమితం అయితే.. జనసేన 21 సీట్లలో పోటి చేసిన అన్నింట్లోనూ గెలిచింది. ఏపీ శాసన సభలో టీడీపీ తర్వాత అత్యధిక స్థానాలున్న రెండో పార్టీగా జనసేన అవతరించింది. ఈ ఎన్నికల్లో సాధించిన సీట్లతో జనసేనకు గాజు గ్లాసు గుర్తును భారత ఎన్నికల సంఘం శాశ్వతంగా కేటాయించింది.
2024 సంవత్సరంలో..
- జనసేనకు గాజు గ్లాసు గుర్తును.. శాశ్వత గుర్తుగా ఎలక్షన్ కమిషన్ కేటాయించింది.
- జనసేన అధినేత పవన్ మొదటిసారి ఎమ్మెల్యే కావడం
- మొదటిసారి గెలిచిన పవన్.. డైరెక్ట్‌గా ఏపీ డిప్యూటీ సీఎం కావడం
- పోటీ చేసినా అన్ని స్థానాల్లో జనసేన గెలవడం, 100 శాతం స్ట్రైక్ రేట్ సాధించడం
- మొదటిసారిగా ఇద్దరు జనసేన అభ్యర్థులు.. ఎంపీలుగా పార్లమెంట్‌లో అడుగుపెట్టడం