సీఎం యోగి కీలక నిర్ణయం: జూన్ 30 వరకు లాక్‌డౌన్ ఆంక్షలు పొడిగింపు!
By సుభాష్ Published on 25 April 2020 6:26 PM ISTదేశ వ్యాప్తంగా కరోనా కాలరాస్తోంది. కరోనాను అరికట్టేందుకు అన్ని రాష్ట్రాల్లో లాక్‌డౌన్ కొనసాగుతోంది. అయినా దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. కరోనాను అరికట్టేందుకు జూన్ 30వ తేదీ వరకూ జనాలు గుమిగూడటంపై ఆంక్షలు కొనసాగుతాయని ఆదేశాలు జారీ చేశారు. ఈ ఆంక్షల సందర్భంగా రాజకీయ సభలు, ర్యాలీలు, వివిధ పంక్షన్లపై నిషేధం ఉంటుందని స్పష్టం చేశారు.
ఈ మేరకు జూన్ 30 వరకూ ప్రజలు ఎక్కడా కూడా గుమిగూడకుండా చర్యలు చేపట్టాలని సీఎం యోగి ఆదిత్యానాథ్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారని సీఎం యోగి మీడియా సలహాదారు మృత్యుంజయకుమార్ తెలిపారు. అలాగే రంజాన్ ప్రార్థనల సందర్భంగా మైనార్టీలు గుంపులు గుంపులుగా చేరడంపై కూడా నిషేధం విధించారు.
కాగా, ఉత్తరప్రదేశ్‌లో ఇప్పటి వరకూ 1600 పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, దాదాపు 20కు పైగా మృతి చెందారు. కరోనాను కట్టడి చేయాలని ప్రతి ఒక్కరు సహకరించాలని సీఎం యోగి కోరారు. మర్కజ్ ప్రార్థనల ఉదాంతం జరగకపోతే దేశంలో కరోనా ఉండకపోయేదని, మర్కజ్ కారణంగా దేశంలో కేసుల సంఖ్య ఒక్కసారిగా పెరిగిపోయాయని అన్నారు.