భారత్‌లో కరోనా వైరస్‌ చాపకింద నీరులా విస్తరిస్తోంది. రోజురోజుకు కరోనా పాజిటివ్‌ కేసులు పెరుగుతున్నాయి. సోమవారం కరోనా పాజిటివ్‌ సంఖ్య 416 కు చేరింది. దీంతో కేంద్రం మరింత అప్రత్తమైంది. ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోదీ జనతా కర్ఫ్యూకు పిలుపునివ్వడంతో.. దేశవ్యాప్తంగా ప్రజలు ఇళ్లకే పరిమితమై జనతా కర్ఫ్యూకు మద్దతు పలికారు. కాగా కరోనాను పూర్తిస్థాయిలో అరికట్టేందుకు కేంద్రం చర్యలు ప్రారంభించింది. దీనిలో భాగంగా దేశవ్యాప్తంగా 80 జిల్లాల్లో లాక్‌డౌన్‌ విధిస్తూ ఆదివారం సాయంత్రం నిర్ణయం తీసుకుంది. దీనికితోడు తెలంగాణ, ఏపీలతో పాటు దేశవ్యాప్తంగా ఎనిమిది రాష్ట్రాలు పూర్తిస్థాయిలో, మరికొన్ని రాష్ట్రాలు కొన్ని ప్రాంతాల్లో లాక్‌డౌన్‌ విధించాయి. అత్యవసరమైతే తప్ప ఎవరూ రోడ్లపైకి రావొద్దని ప్రజలకు పిలుపునిచ్చారు.

Read Also :కరోనా ఎఫెక్ట్ : ప్రభాస్ విదేశాల నుంచి రాగానే ఏం చేశాడో తెలుసా..!

కానీ సోమవారం ఉదయం నుంచి ప్రజలు యథావిథిగా రోడ్లపైకి వచ్చారు. దుకాణాలు తెరుచుకున్నాయి. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ అసహనం వ్యక్తం చేస్తూ ట్వీట్‌ చేశారు. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో విధించిన లాక్‌డౌన్‌ పట్ల ప్రజలు నిర్లక్ష్యం వహించరాదని ప్రధాని నరేంద్ర మోదీ విజ్ఞప్తి చేశారు. అందరూ ఆరోగ్య సూచనలు పాటించాలని, లాక్‌డౌన్‌ పట్ల నిర్లక్ష్యం వహించొద్దని సూచించారు. దీన్ని ఎందుకు అమలు చేశామో గుర్తించాలని, లాక్‌డౌన్‌ను తీవ్రంగా పరిగణించి ప్రజలు అందరూ ఆచరించాలని, ప్రతీ ఒక్కరూ విధిగా లాక్‌డౌన్‌ నియమాలు పాటించాలని మోదీ సూచించారు. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా నియమాలను కచ్చితంగా అమలు చేయాలని ప్రధాని ఆదేశించారు. అలక్ష్యం చేస్తే భవిష్యత్తులో ముప్పు పెరుగుతుందని గుర్తించాలని అన్నారు. ఇటలీ, స్పెయిన్‌ అనుభవాలను మరిచిపోవద్దని, మూడు దేశాల్లో జరుగుతున్న నష్టాన్ని చూసి కళ్లు తెరవండి అంటూ ప్రధాని ట్వీట్‌ చేశారు.

కేంద్రం వార్నింగ్‌.. రంగంలోకి పోలీసులు..

భారత్‌లో కరోనా వైరస్‌ వేగంగా వ్యాప్తి చెందుతుంది. దీంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వైరస్‌ను అరికట్టేందుకు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాయి. దీనిలో భాగంగా తెలంగాణ, ఏపీలతో పాటు పలు రాష్ట్రాల్లో లాక్‌డౌన్‌ ప్రకటించారు. దీనికితోడు కేంద్రం 80 జిల్లాల్లో లాక్‌డౌన్‌ ప్రకటించింది. కానీ సోమవారం ప్రజలు ఒక్కసారిగా రోడ్లపైకి వచ్చారు. దీంతో రహదారులపై ఎప్పటిలాగే రద్దీ నెలకొంది. దుకాణాలు తెరుచుకున్నాయి. ఇదే సమయంలో ప్రధాని మోదీ ట్వీట్‌తో పాటు రాష్ట్రాలకు కేంద్రం హెచ్చరికలు చేసింది. రాష్ట్రాలన్నీ లాక్‌డౌన్‌ని కఠినంగా అమలు చేయాలని కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకోవాలని ఆదేశించింది.

దీంతో తెలంగాణ పోలీసులు అలర్టయ్యారు. హైదరాబాద్‌ నగరంతో పాటు ప్రధాన పట్టణాల్లో బయటకు వచ్చిన ప్రజలను ఇళ్లకు పంపించేస్తున్నారు. షాపులను మూయించివేంచారు. ప్రభుత్వం ఆదేశాలు పాటించక పోతే కఠిన చర్యలు ఉంటాయని పోలీసులు ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. వెంటనే రోడ్లపై నుంచి ప్రజలు ఇళ్లకు వెళ్లాలని ఆదేశించారు. మరోవైపు ఏపీలోని విజయవాడతో పాటు పలు ప్రాంతాల్లో పోలీసులు అప్రమత్తమయ్యారు. రోడ్లపైకి ప్రజలు రాకుండా చర్యలు చేపట్టారు. ఎవరూ బయటకు రావద్దని, నిబంధనలు అతిక్రమించి రోడ్లపైకి వస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.

Read Also :కరోనా ఎఫెక్ట్.. లాక్‌డౌన్ దిశగా అన్ని రాష్ట్రాలు

న్యూస్‌మీటర్ నెట్‌వర్క్

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్.. మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను అందిస్తుంది.