లాక్ డౌన్ కఠిన నిర్ణయమే.. అది మీ రక్షణ కోసమే
By Newsmeter.Network Published on 29 March 2020 12:44 PM ISTదేశంలోని చిన్నా, పెద్ద అందరూ లాక్‌డౌన్ వల్ల ఇబ్బందులు పడుతున్నా.. అలాంటి కఠిన నిర్ణయం తీసుకుంది మీ రక్షణ కోసమేనని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. దేశంలోని చిన్నా, పెద్దా అందరికీ నేను క్షమాపణలు చెబుతున్నానని ప్రధాని అన్నారు. నాపై కోపం కూడా వచ్చుండొచ్చు.. కానీ అందరికీ నేనొక విషయం స్పష్టం చేయదల్చుకున్నా.. లాక్ డౌన్ ఒక తప్పని సరి అనివార్య నిర్ణయం అని ప్రధాని అన్నారు. ఆదివారం ప్రధాని నరేంద్ర మోదీ 'మక్ కీ బాత్' కార్యక్రమంలో మాట్లాడారు.. కరోనా మహమ్మారితో యుద్ధం చేయడానికి లాక్ డౌన్ తప్ప మనకు వేరేదారి లేదని ప్రధాని తెలిపారు. ముఖ్యంగా దినసరి కూలీలు పడుతున్న బాధల్ని తాను అర్థం చేసుకోగలనని, ప్రజలు తమని తాము రక్షించుకుంటూ.. తమ కుటుంబాల్ని కూడా కాపాడుకోవడానికే ఈ కఠిన నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని అన్నారు.
Also Read :భారత్‌లో వెయ్యికి చేరువలో.. కరోనా పాజిటివ్ కేసులు
మనందరం సురక్షితంగా ఉండాలంటే.. మేం సూచించే వరకు లక్షణ రేఖ దాటకుండా ఉండాల్సిందేనని ప్రధాని తేల్చి చెప్పారు. ప్రతీ ఒక్కరూ ధైర్యంతో కరోనాపై పోరాడాలని పిలుపునిచ్చారు. వైరస్ కట్టడికి వైద్యులు, నర్సులు, ఇతర వైద్య సిబ్బంది చేస్తున్న కృషిని అభినందించిన ప్రధాని.. వారిని స్ఫూర్తిగా తీసుకోవాలని ప్రజలను కోరారు. చిన్న పిల్లల దగ్గరినుంచి పండు ముసలి దాకా ఏ ఒక్కరినీ కరోనా మహమ్మారి వదిలిపెట్టడం లేదని, ప్రపంచ వ్యాప్తంగా విజృంభిస్తోన్న ఈ వైరస్.. మానవాళి మనుగడకే ప్రమాదకరంగా తయారైందని ప్రధాని మోదీ గుర్తుచేశారు. వైరస్ ప్రమాదాన్ని గుర్తించి, ఆ మేరకు తీసుకున్న జాగ్రత్త చర్యల్లో భాగమే లాక్ డౌన్ అని చెప్పారు. ఒకరినొకరు తాకకుండా దూరం పాటించడం ద్వారానే వైరస్ వ్యాప్తిని నిరోధించొచ్చని, ఈ ప్రక్రియను అందరూ పాటించాలని, అంతమాత్రాన తోటి మనుషులతో మానసికంగా దూరమైనట్లు కాదన్న సంగతి మర్చిపోరాదని ప్రధాని అన్నారు. సోషల్ డిస్టెన్స్‌ను పెంచుకోండి.. కానీ ఎమోషనల్ డిస్టెన్స్‌ను తగ్గించుకోండి అని ప్రధాని పిలుపునిచ్చారు.