ఏపీ: ఆ రెండు జిల్లాల్లో లాక్‌డౌన్ పొడిగింపు.. మరింత కఠినం
By సుభాష్ Published on 8 July 2020 4:03 PM ISTఏపీలో కరోనా వైరస్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతోంది. రోజురోజుకు పాజిటివ్ కేసుల సంఖ్య పెరిగిపోతుండటంతో మరింత భయాందోళన నెలకొంది. ఇక విజయవాడ, కర్నూలు, గుంటూరు, రాజమండ్రి వంటి నగరాలతో పాటు మండలాలు, గ్రామాల్లో కూడా కరోనా వ్యాపిస్తోంది. ఇప్పటికే కరోనా అధికంగా ఉన్న ప్రకాశం, అనంతపురం, ఈస్ట్ గోదావరి, శ్రీకాకుళం, పశ్చిమగోదావరి జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో లాక్‌డౌన్ కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఆయా ప్రదేశాల్లో కరోనా వ్యాప్తి తీవ్రంగా ఉన్న నేపథ్యంలో లాక్‌డౌన్ నెలాఖరు వరకు పొడిగించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
ఇదిలా ఉండగా, తూర్పుగోదావరి జిల్లాలోని అమలాపురంలో లాక్‌డౌన్ అమలు చేశారు. రోజురోజుకు కేసుల సంఖ్య పెరుగుతుండటంతో జిల్లా కలెక్టర్ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఉదయం 7 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు నిత్యావసర దుకాణాలు, రెస్టారెంట్లు, హోటళ్లు, మద్యం షాపులు, కూరగాయల షాపులు తెరవాలని సూచించారు. ఆ తర్వాత మెడికల్ షాపులు, అత్యవసరమైన వాటికి మాత్రమే మినహాయింపు ఉంటుందని అన్నారు. ఈ నిబంధనలు అమలాపురం చుట్టుపక్కల ప్రాంతాల్లో అమలులో ఉంటాయన్నారు. అయితే పశ్చిమగోదావరి జిల్లాలోని పలు ప్రాంతాల్లో లాక్‌డౌన్ కొనసాగించాలని జిల్లా అధికారులు భావిస్తున్నారు. భారీగా కరోనా కేసులు వస్తుండటంతో జిల్లాలోని ఏడు మండలాల్లో లాక్‌డౌన్‌ను కఠినంగా అమలు చేయనున్నారు. ప్రజలు బయటకు వస్తే ఖచ్చితంగా మాస్క్ లు ధరించాలని, భౌతిక దూరం తప్పని సరి అని అన్నారు. నిబంధనలు ఉల్లంగించిన వారిపై కేసులు తప్పవని హెచ్చరిస్తున్నారు అధికారులు.