ఏసీ, కూలర్, ఫ్యాన్లు ఎక్కువగా వాడుతున్నారా ? అయితే ఈ జాగ్రత్తలు పాటించాల్సిందే..

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  30 May 2020 2:54 AM GMT
ఏసీ, కూలర్, ఫ్యాన్లు ఎక్కువగా వాడుతున్నారా ? అయితే ఈ జాగ్రత్తలు పాటించాల్సిందే..

వేసవి కాలం అంటే చాలు.. బాబోయ్ ఎండలా ? అనే పరిస్థితి ఏర్పడింది. సుమారు 10 -15 సంవత్సరాల క్రితం వేసవికాలం అంటే మార్చి, ఏప్రిల్, మే నెలల వరకూ మాత్రమే ఉండేది. జూన్ మధ్య నుంచి వర్షాలు పడటంతో వర్షాకాలం మొదలయ్యేది. కానీ రాను రాను వేసవి కాలం జనవరి నుంచే మొదలైపోతోంది. ఈ ఏడాది జనవరి చివరి నుంచే మండే ఎండలు మొదలయ్యాయి. మే నెల ముగియవస్తున్నా ఇంకా తొలకరి జల్లు పడలేదు. రోహిణి కార్తె రాకముందే రోళ్లు పగిలే ఎండలు కాశాయి.

ఈ ఏడాది కరోనా వైరస్ కు బలైన వారు కాక వడదెబ్బకు చనిపోయిన వారి సంఖ్య పదుల సంఖ్యలో నమోదైంది. యువత, నడి వయస్కులే ఎండల ధాటికి పిట్టల్లా రాలిపోయే పరిస్థితులొస్తున్నాయి. ఇందుకు కారణాలు లేకపోలేదు. వాతావరణంలో పెరిగిపోతున్న కాలుష్యం, ఓజోన్ పొర దెబ్బతినడంతో అతి నీల లోహిత కిరణాలు నేరుగా మనుషులపైనే పడటంతో భానుడి ప్రభావం అధికంగా కనిపిస్తోంది. కొంతమందైతే ఏకంగా ఎండలో పెనాలు పెట్టి ఆమ్లెట్లు, దోసెలు పోసుకుని తింటున్నారు కూడా. ఇలా చేసిన వీడియోలను టిక్ టాక్ లో పెట్టగా వాటికి కొన్ని లక్షల వ్యూస్ కూడా వచ్చాయి.

వేసవి రాగానే ఏసీ, కూలర్లు పెరిగే డిమాండ్ అంతా ఇంతా కాదు. మామూలు రోజుల్లో రూ.2500 కే లభించే కూలర్ వేసవి వచ్చేసరికి రూ.5000 పలుకుతోంది. ఇక ఏసీల సంగతైతే చెప్పనక్కర్లేదు. ఏసీ షో రూమ్ లలో వాటికున్న ప్లస్ పాయింట్లలో ఉన్నవి, లేనివి చెప్పి ఏదో రకంగా వినియోగదారుడికి అంటగట్టేస్తారు. అది వేరే విషయం. ఇక విషయానికొస్తే..వేసవిలో రేకుల షెడ్ అయినా, శ్లాబ్ అయినా ఉక్కపోత మాత్రం ఎక్కడైనా ఒకేలా ఉంటోంది. అందుకే తమ సామర్థ్యం మేరకు కూలర్, ఏసీలను కొని వాటి వద్దే కూర్చుని కృత్రిమంగా వచ్చే చల్లటి గాలికి కాస్త సేదతీరుతుంటారు చాలా మంది. అలాంటి వారిలో మీరూ ఉంటే ఈ జాగ్రత్తలు తప్పకుండా పాటించాలి.

కేంద్రం జారీ చేసిన మార్గదర్శకాలు

కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ఏసీ, కూలర్లు, ఫ్యాన్లు వాడేవారు కొన్ని జాగ్రత్తలు పాటించాలని కేంద్రం కొన్ని మార్గదర్శకాలను విడుదల చేసింది. ఏసీలు వాడేవారు..తరచూ వాటిలోని ఫిల్టర్లను క్లీన్ చేసుకోవడంతో పాటు..21 డిగ్రీల కన్నా ఎక్కువ (20, 19,18 డిగ్రీలు) పెట్టకూడదు. అలాగే ఏసీ ఆన్ చేసినపుడు సాధారణంగా కిటికీలు, తలుపులన్నీ మూసివేస్తాం కానీ.. ఇప్పుడు కరోనా కాలం కాబట్టి ఏసీ ఆన్ చేసిన గదిలో కిటికీని కొద్దిగా తెరిచి పెట్టుకోవాలి.

కూలర్లు వాడేవారు వీలైనంత వరకూ కూలర్ ను బయటిగాలి తగిలేలా పెట్టుకోవడం మంచిది. అలాగే తరచూ కూలర్ లోపల ఉండే గడ్డిని మార్చడం లేదా..కూలర్ సైడ్ ఉండే విండోస్ ను క్లీన్ చేసుకోవాలి. కూలర్ ను మరీ హై స్పీడ్ లో కాకుండా మీడియంలో లేదా అంతకన్నా తక్కువలో పెట్టుకోవడం ఒకవేళ కూలర్ కు బయటి గాలి తగిలే సౌకర్యం లేకపోతే కూలర్ ను వాడకపోవడమే మంచిది. ఫ్యాన్ తిరిగే స్పీడ్ తో వాటి రెక్కలకు దుమ్ము చాలా తేలికగా పట్టేస్తుంది. అందుకే ఫ్యాన్లు ఎక్కువగా వాడేవారు తరచూ వాటిని శుభ్రం చేసుకోవాలి.

Next Story
Share it