దీదీ చెప్పేసింది.. ప్రార్థనా మందిరాలు తెరచుకోవచ్చు..!

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  30 May 2020 2:26 AM GMT
దీదీ చెప్పేసింది.. ప్రార్థనా మందిరాలు తెరచుకోవచ్చు..!

లాక్ డౌన్ కారణంగా దేశ వ్యాప్తంగా ఉన్న దేవాలయాలు, చర్చ్ లు, మసీదులు మూత పడ్డాయి. దేవాలయాలలో కేవలం పూజారులు వెళ్లడం పూజలు చేయడం మినహా సామాన్య భక్తులకు ఎంట్రీ లేదు. మసీదుల్లో కేవలం 5 మందికి మాత్రమే అనుమతిని ఇచ్చారు. చర్చ్ లలో పాస్టర్లు మాత్రమే వెళ్లాలని నిబంధనలు ఉంచారు.

బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ రాష్ట్రంలో ఇకపై ప్రార్థనా మందిరాలు తెరచుకోవచ్చని తెలిపారు. జూన్ 1 నుండి ప్రార్థనా మందిరాలు తెరచుకోవచ్చని స్పష్టం చేశారు. గుళ్ళు, మసీదులు, గురు ద్వారాలు, చర్చిలు తెరచుకోవచ్చని.. అయితే 10 మంది కంటే ఎక్కువ మందికి ప్రవేశం లేదని స్పష్టం చేశారు. అయితే అందరూ ఒకే చోట ఉండడం నిషిద్ధమని తెలిపారు. జూన్ ఒకటి నుండి ఇది అమలు లోకి వస్తుందని ఆన్ లైన్ ప్రెస్ కాన్ఫరెన్స్ లో మమతా బెనర్జీ స్పష్టం చేశారు.

కేంద్రం తీసుకుని వచ్చిన శ్రామిక్ ట్రైన్స్ విషయంలో కూడా మమతా బెనర్జీ విమర్శలు గుప్పించారు. వలస కూలీలు సొంత ఊళ్లకు చేరుకోడానికి చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారని.. శ్రామిక్ ట్రైన్స్ లో ఎలా పడితే అలా కూర్చోపెడుతున్నారని. సామాజిక దూరం అన్నది లేదని.. తినడానికి తిండి, తాగడానికి నీళ్లు లేవని ఆమె అన్నారు. ఏమి చేద్దామని అనుకుంటున్నారు.. శ్రామిక్ ట్రైన్స్ ను నడుపుతున్నారా.. కరోనా ఎక్స్ ప్రెస్ లను నడుపుతున్నారా అంటూ ఆమె ప్రశ్నలు కురిపించారు. రైల్వే మినిస్ట్రీ అనుకుంటే బోగీలను పెంచడం పెద్ద కష్టం కాదని.. కానీ అలాంటివేమీ చేయడం లేదని ఆరోపించారు. 48 గంటల సేపు తిండీ, నీరు లేకుండా ఎలా ఉండగలరని ఆమె అన్నారు. అలాంటి ట్రైన్స్ నడుపుతూ ఉన్నప్పుడు ప్రార్థనా మందిరాలను ఎందుకు తెరవకూడదు అని ఆమె ప్రశ్నించారు.

వెస్ట్ బెంగాల్ కరోనా కేసులను అదుపు చేయడంలో సక్సెస్ అయిందని.. ఇప్పుడు పెరుగుతున్న కేసులన్నీ ఇతర రాష్ట్రాల నుండి వస్తున్న వారివేనని ఆమె అన్నారు. టీ, జూట్ ఇండస్ట్రీ కూడా జూన్ 1 నుండి తెరవనున్నామని.. స్పష్టం చేశారు. అన్ని ప్రభుత్వ కార్యాలయాలు ఫుల్ స్ట్రెంత్ తో పని చేస్తాయని ఆమె తెలిపారు.

దేశంలో ప్రార్థనా మందిరాలు మర్చి 25 నుండి మూసి వేసి ఉంచారు. ప్రార్థనా మందిరాలలో భక్తులు వెళ్లడం సహజం కావడంతో వైరస్ వ్యాప్తి చెందడం కూడా అంతే సులువుగా ఉంటుంది. దీంతో ప్రార్థనా మందిరాలను మూసి వేశారు. కర్ణాటక ప్రభుత్వం కూడా వచ్చే సోమవారం నుండి ప్రార్థనా మందిరాలు తెరచుకునేలా అనుమతి ఇవ్వాలని కోరింది. మే 30న లాక్ డౌన్ ను పొడిగించాలా లేదా అన్నదానిపై కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది.

Next Story