సినిమా థియేటర్‌ హౌస్‌ఫుల్‌

By సుభాష్  Published on  16 April 2020 11:05 AM IST
సినిమా థియేటర్‌ హౌస్‌ఫుల్‌

దేశ వ్యాప్తంగా కరోనా వైరస్‌ అతలాకుతలం చేస్తుంటే అంబ సినిమా థియేటర్‌ మాత్రం హౌస్‌ఫుల్‌ అయిపోయింది. ఏంటి లాక్‌డౌన్‌ ఉంది కదా.. సినిమా థియేటర్లు మూసి ఉన్నాయి. హౌస్‌ఫుల్‌ ఎక్కడ అని అనుకుంటున్నారా..? అదేం లేదండీ..

లాక్‌డౌన్‌ కారణంగా నిబంధనలు ఉల్లంఘించి రోడ్లపైకి వచ్చిన వాహనాలను పోలీసులు సీజ్‌ చేసి సినిమా థియేటర్‌ పార్కింగ్‌లో ఉంచేశారు. దీంతో హైదరాబాద్‌ మెహిదీపట్నం అంబ థియేటర్‌ వెహికిల్స్‌ పార్కింగ్‌తో సందడి సందడిగా మారిపోయింది. అంతేకాదు వాహనదారులతో కిక్కిరిసిపోతోంది. దేశ మంతా లాక్‌డౌన్‌ కొనసాగుతున్న నేపథ్యంలో నిబంధనలను ఉల్లంఘించి రోడ్లపైకి వచ్చిన వారి వాహనాలను పోలీసులు సీజ్‌ చేస్తున్నారు.

లాక్‌డౌన్‌ కారణంగా జనాలెవ్వరూ ఇంట్లో నుంచి బయటకు రావొద్దని ఎన్ని సార్లు చెప్పినా ఏ మాత్రం వినడం లేదు. కేసులు చేస్తామని హెచ్చరించినా పెడచెవిన పెడుతున్నారు. దీంతో లాక్‌డౌన్‌ నిబంధనలు అతిక్రమించి రోడ్లపైకి వచ్చిన వాహనాలను ఆసిఫ్‌ నగర్‌ పోలీసులు స్వాధీనం చేసుకుని అంబ సినిమా థయేటర్‌ పార్కింగ్‌లో ఉంచారు.

చలానా చెల్లించి వాహనాలు తీసుకెళ్లాలని చెప్పడంతో వాహనదారులు పెద్ద ఎత్తున క్యూ కట్టారు. దీంతో థియేటర్‌ ప్రాంతంలో సినిమా చూసేందుకు వచ్చే వారి విధంగా నిండిపోయింది. చలానా చెల్లించి వాహనాలు తీసుకెళ్లే వారికి రశీదులు ఇవ్వడానికి గానూ టికెట్‌ కౌంటర్‌ను ఉపయోగిస్తున్నారు. ఒక వేళ లాక్‌డౌన్‌ ఎత్తివేసినా థియేటర్లకు జనాలు రావాలంటే సమయం పట్టే అవకాశాలు ఉన్నాయంటున్నారు సినీ విశ్లేషకులు.

Next Story