రోజువారీ కార్యకలాపాల నుంచి మన శరీరానికి విశ్రాంతి లభించాలంటే నిద్ర చాలా అవసరం. మంచిగా నిద్రపోయినప్పుడే మనం ఆరోగ్యంగా ఉంటాం.. అలాగే శరీరంలోని అన్ని అవయవాల పనితీరు బాగుంటుంది. అయితే మన బరువును కూడా నిద్ర డిసైడ్ చేస్తుందట. రోజూ రాత్రి వేళ తక్కువ సమయం నిద్రపోయినా లేదా అతిగా నిద్రపోయినా బరువు పెరిగే ముప్పు ఉందని అనేక పరిశోధనల్లో తేలింది. నిద్రలేమి మన శరీరంలో హార్మోన్ల సమతుల్యతను దెబ్బతీస్తుంది.
తక్కువ సమయం నిద్రపోయేటప్పుడు ఆకలిని పెంచే గ్రెలిన్ హార్మోన్ ఉత్పత్తి పెరిగి, అవసరానికి మించి తింటూ ఉంటాం. ఇలా అవసరానికి మించి తినే ఆహారం వల్ల శరీరంలో అనవసర కొవ్వులు పేరుకుపోయి బరువు పెరిగే అవకాశం ఉంటుంది. అలాగే జీవ క్రియ నెమ్మదిగా సాగుతుంది. అందుకే మనం ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతి రోజూ 7 నుంచి 9 గంటల పాటు నిద్రపోతే సరిపోతుంది. ఇంతకంటే ఎక్కువ సమయం పడుకున్నా బరువు పెరిగే ముప్పు ఉంటుంది.