పురుషుల్లో స్పెర్మ్ కౌంట్ ఎందుకు తగ్గుతోంది
ఆరోగ్యకరమైన పురుషునిలో ఒక మిల్లీమీటర్ వీర్యంలో 40 నుంచి 300 మిలియన్ల వీర్యకణాలు ఉంటాయి.
By - అంజి |
పురుషుల్లో స్పెర్మ్ కౌంట్ ఎందుకు తగ్గుతోంది
ఆరోగ్యకరమైన పురుషునిలో ఒక మిల్లీమీటర్ వీర్యంలో 40 నుంచి 300 మిలియన్ల వీర్యకణాలు ఉంటాయి. ఈ సంఖ్య 10 మిలియన్ నుంచి 20 మిలియన్ మధ్య ఉంటే లో స్పెర్మ్ కౌంట్ అంటారు. స్పెర్మ్ కౌంట్ తగ్గినప్పుడు సంతానోత్పత్తి సామర్థ్యం తగ్గి వీర్య కణాల నాణ్యత, వాటి వేగం కూడా తగ్గిపోతుంది. దీని వల్ల సంతానోత్పత్తి సమస్యలు వస్తాయి.
ఇవి స్పెర్మ్ కౌంట్ తగ్గిస్తాయి
ఊబకాయం వల్ల శుక్రకణనాల సంఖ్య తగ్గటం, చురుకుగా కదల్లేకపోవడం, వాటి ఆకారం సరిగా లేకపోవడం వంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. అందుకే క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. ఆహారం విషయంలో జాగ్రత్త వహించాలి.
గంజాయి, కొకైన్, హెరాయిన్, మెథాంఫెటమైన్, ఆక్సీకోడోన్ వంటి మత్తు పదార్థాలు వీర్యం ఉత్పత్తి, వీర్యం నాణ్యతపై ప్రభావం చూపుతాయి. వీటిని ఎట్టి పరిస్థితుల్లో తీసుకోకూడదు.
సిగరెట్లు, చుట్టలు, బీడీలు వంటి పొగాకు ఉత్పత్తులు మగవారిలో సంతాన సామర్థ్యాన్ని తగ్గిస్తున్నాయి. వీర్యం నాణ్యతను, శుక్రకణాల సంఖ్యను తగ్గిస్తాయి. పొగతాగే అలవాటుకు దూరంగా ఉండండి. మద్యపానం ఆరోగ్యానికి హానికరం. ఇది స్పెర్మ్ ఉత్పత్తిని, నాణ్యతను దెబ్బతీస్తుంది.
స్పెర్మ్ కౌంట్ పెరగాలంటే..
మన అవాట్లు, తీసుకునే ఆహారం వీర్యం నాణ్యతను ప్రభావితం చేస్తాయి. తాజా పండ్లు, కూరగాయలు, చేపలు, గుడ్లను ఆహారంగా తీసుకోవాలి. వీటిలో ఉండే ప్రోటీన్స్, విటమిన్లు వీర్యం వృద్ధికి కారణం అవుతాయి. అరటి పండులో మెగ్నీషియం, విటమిన్ బి1 ఉంటాయి. ఇవి స్పెర్మ్ ఉత్పత్తిని పెంచుతాయి. బచ్చలికూర, వెల్లుల్లి, మునక్కాయ, దానిమ్మ, టమాట, గుమ్మడికాయ గింజలు, క్యారెట్, వాల్‌నట్‌లు వీర్యం ఉత్పత్తిని, నాణ్యతను పెంచుతాయి. వీటిని ఆహారంలో భాగం చేసుకోవాలి. రెడ్ మీట్, నూనెలో ఎక్కువగా వేయించే పదార్థాలు, షుగర్ డ్రింక్స్, స్వీట్లకు దూరంగా ఉండాలి. ప్రతిరోజూ కనీసం అరగంట పాటు వ్యాయామం చేయాలి. అలాగే రాత్రి పూట కనీసం 7 నుంచి 8 గంటల పాటు నిద్రపోవాలి. ఒకవేళ వీర్యకణాల సంఖ్య ఉండాల్సిన పరిమాణం కంటే తక్కువ ఉంటే డాక్టర్ సూచనలతో సప్లిమెంట్స్ వాడాలి.