స్నేహితులతో, బంధు మిత్రులతో కలిసి ఎప్పుడైనా రెస్టారెంట్‌కి వెళ్తే చివరల్లో బిల్లుతో పాటు సోంపు కూడా ఇస్తుంటారు. బిల్లు కట్టి కొంత సోంపు తిని బయటకు వస్తుంటాం. దీని వల్ల మనకు అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. సోంపులో ఉండే ఔషధ గుణాలు, యాంటీ ఆక్సిడెంట్లు శరీరానికి ఆరోగ్యాన్నిస్తాయి. దీని వల్ల వ్యాధుల బారిన పడే ముప్పు తగ్గుతుంది. ప్రతి రోజు కాస్త సోంపు తీసుకునేవారికి క్యాన్సర్, గుండె జబ్బులు, ఊబకాయం, టైప్-2 డయాబెటిస్ వచ్చే ప్రమాదం తక్కువని పలు అధ్యయనాల్లో తేలింది.
సోంపు తినడం వల్ల జీర్ణ ప్రక్రియ సజావుగా సాగుతుంది. క్యాన్సర్ కణాలు శరీరంలో వ్యాప్తి చెందకుండా నిరోధించే శక్తి కూడా సోంపునకు ఉంది. ముఖ్యంగా మహిళల్లో రొమ్ము క్యాన్సర్ ముప్పును తగ్గిస్తుంది. సోంపులో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు శరీరంలో హానికర బ్యాక్టీరియా పెరగకుండా చేస్తాయి. మహిళలు ప్రతి రోజూ ఒక స్పూన్ సోంపు తింటే పీరియడ్స్ సమయంలో వచ్చే తీవ్రమైన పొట్టనొప్పి, తిమ్మిరి వంటి సమస్యల నుంచి కాస్త ఉపశమనం కలుగుతుంది.