ప్రతి రోజూ కనీసం 2 నుంచి 3 లీటర్ల నీరు తాగాలి. ఇది శరీరాన్ని తేమగా ఉంచడంతో పాటు డీ హైడ్రేషన్ సమస్యను తగ్గిస్తుంది. ముఖంపై ముడతలు, వృద్థాప్య ఛాయలు తగ్గుతాయి. డ్రైఫ్రూట్స్ ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. రోజూ గుప్పెడు డ్రైఫ్రూట్స్ తింటే శరీరానికి కావాల్సిన పోషకాలు, శక్తి లభిస్తాయి. విటమిన్ సి ఉండే నారింజ, బత్తాయి, బ్లూబెర్రీలు, బొప్పాయి, స్ట్రాబెర్రీలను తీసుకుంటే వ్యాధి నిరోధక శక్తి పెరగడంతో పాటు శరీరం యవ్వనంగా కనిపిస్తుంది. కొన్ని రకాల క్యాన్సర్ల ముప్పు కూడా తగ్గుతుంది.
టమాటాల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు చర్మాన్ని తేమగా ఉంచి యవ్వనంగా కనిపించేలా చేస్తాయి. రోజు టమాటాను పరిమితంగా ఆహారంలో భాగం చేసుకుంటే వృద్ధాప్య ఛాయలు అంతగా కనిపించవు. పాలలో ఎముకలను బలంగా ఉంచే కాల్షియం, విటమిన్ డి ఉంటాయి. ఇవి స్త్రీల చర్మాన్ని సంరక్షించి, యవ్వనంగా కనిపించేలా చేస్తాయి. అందుకే మహిళలు అవకాశం ఉంటే రోజూ కొవ్వు శాతం తక్కువగా ఉండే ఒక గ్లాసు పాలు తాగడం ఆరోగ్యానికి మంచిది.
పెరుగును కూడా నిర్లక్ష్యం చేయకుండా ఆహారంలో భాగం చేసుకోవాలి. ఇది చర్మ సంరక్షణకు సాయపడటంతో పాటు రొమ్ము క్యాన్సర్ ముప్పును తగ్గిస్తుంది. మహిళల్లో కనిపించే అనేక రకాల ఇన్‌ఫెక్షన్లు, అల్సర్లను పెరుగు తగ్గిస్తుంది.