దాహంగా లేదని నీరు తాగడం మానేస్తున్నారా?

శరీరంలో జీవక్రియలు సక్రమంగా జరగడానికి తగినంత నీరు తాగుతుండాలి. వాతావరణం చల్లగా ఉందని, దాహం లేదని, పనిలో ఉన్నామని నీటిని పక్కన పెట్టకూడదు.

By అంజి  Published on  22 Oct 2024 9:15 AM IST
drinking water, Lifestyle, Health Tips

దాహంగా లేదని నీరు తాగడం మానేస్తున్నారా?

శరీరంలో జీవక్రియలు సక్రమంగా జరగడానికి తగినంత నీరు తాగుతుండాలి. వాతావరణం చల్లగా ఉందని, దాహం లేదని, పనిలో ఉన్నామని నీటిని పక్కన పెట్టకూడదు. శరీరంలో కణాలు సక్రమంగా పని చేయడానికి, లాలాజలం, రక్తం, మూత్రం, చెమట వంటి అన్ని ద్రవాలకు నీరు తప్పనిసరి. శరీరంలో అవసరం మేరకు నీరు లభించకపోతే తలనొప్పి, అతిగా దాహం వేయడం, నీరసంగా అనిపించడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. తగినంత నీరు తీసుకోకపోతే డీహైడ్రేషన్‌ సమస్య తలెత్తి మెదడు పనితీరుపై ప్రభావం పడుతుంది.

నీరు మరీ తక్కువగా తాగితే ఆందోళన, అలసట, ఏకాగ్రత తగ్గడం, జ్ఞాపకశక్తి సమస్యలు వస్తాయి. రోగనిరోధక శక్తి తగ్గి ఇన్ఫెక్షన్ల ముప్పు పెరిగే అవకాశం ఉంది. మూత్రపిండాలు సరిగా పనిచేయక భవిష్యత్తులో కిడ్నీలో రాళ్లు, మూత్రనాళాల ఇన్ఫెక్షన్‌ వచ్చే ప్రమాదం ఉంది. అవసరమైన మేరకు నీరు అందకపోవడం వల్ల శరీరం డీహైడ్రేట్‌ అయ్యి చర్మం పొడిబారి తామర, మొటిమలు, ఇతర చర్మ సమస్యలు, మలబద్ధకం సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. నీరు తక్కువగా తాగితే చిన్నతనంలోనే వృద్ధ్యాప్య ఛాయలు కనిపిస్తాయి. అందుకే రోజూ కనీసం 2 నుంచి 3 లీట్ల నీరు తాగాలి.

ఆరోగ్యంగా ఉండే వ్యక్తి శరీరంలో సాధారణంగా 70 శాతం నీరు ఉంటుంది. ఇది శరీరం నుంచి చెమట లేదా మూత్రం రూపంలో బయటకు పోతుంది. శరీరంలో జీవక్రియలకు అవసరమైన నీటిని తిరిగి పొందేందుకు.. రోజుకి 2 నుంచి 3 లీటర్ల నీరు తాగాలి. అయితే దాహం వేసినప్పుడు నీటిని నిల్చొని తాగేకంటే కూర్చొని తాగడం మంచిదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. దీని వల్ల శరీరానికి ఎక్కువ మేలు జరుగుతుందని చెబుతున్నారు. నిలబడి మంచి నీటిని తాగడం వల్ల అది నేరుగా దిగువ పొత్తికడుపులోకి వెళ్తుందట.

దీని వల్ల నీటిలోని పోషకాలు, ఖనిజాలు మనకు సరిగా అందవని.. మూత్రపిండాలు, మూత్రాశయం మీద కూడా ఒత్తిడి పెరుగుతుందని అభిప్రాయపడుతున్నారు. అందుకే నీటిని నెమ్మదిగా కూర్చుని తాగడం మేలని సలహా ఇస్తున్నారు. అలాగే నీటిని వేగంగా కాకుండా కాస్త నెమ్మదిగా తాగడం మంచిదంటున్నారు. ఫ్రిజ్‌లో నీటిని ఎక్కువగా తాగడం కంటే కుండలోని నీటిని తాగడం ఆరోగ్యానికి మేలు చేస్తుందని సూచిస్తున్నారు.

Next Story