వర్షాకాలంలో ఆరోగ్యపరంగా అనేక సవాళ్లను తీసుకువస్తుంది. ముఖ్యంగా ఇంట్లో చిన్నారుల విషయంలో ఈ కాలంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. అందుకు వైద్య నిపుణులు కొన్ని సూచనలు చేస్తున్నారు.. అవేంటో ఇప్పుడు చూద్దాం..
వర్షాకాలంలో వాతావరణం పగలు కాస్త వేడిగా, తేమగా.. రాత్రిళ్లు చల్లగా ఉంటుంది. అందుకే పగలు చిన్నారులకు మృదువైన, తేలికపాటి దుస్తులు వేయాలి. రాత్రి పూర్తి స్లీవ్‌లతో కూడిన మందపాటి దుస్తులు పిల్లలను వెచ్చగా ఉంచుతాయి.
వర్షాకాలంలో అంటు వ్యాధులు, ఇన్‌ఫెక్షన్ల ముప్పు ఎక్కువ. అందుకే స్కూలుకు వెళ్లే పిల్లలు వర్షంలో తడవకుండా చూసుకోవాలి. అలాగే పిల్లలు బయటకు వెళ్లేటప్పుడు రెయిన్ కోట్లు, గొడుగు తీసుకెళ్లాలా చూడాలి.
వర్షాకాలంలో చిన్నారులు తరచుగా మూత్రవిసర్జన చేస్తుంటారు. అందుకే పసిపిల్లల్లో తడి, ఫంగల్ ఇన్ఫెక్షన్లను నివారించడానికి డైపర్లను తరచుగా మార్చాలి.
వర్షాకాలంలో దోమల ఉధృతి ఎక్కువగా ఉంటుంది. వీటి వల్ల మలేరియా, డెంగ్యూ వంటి జ్వరాల ముప్పు ఎక్కువగా ఉంటుంది. అందుకే వీటి బారి నుంచి చిన్నారులను రక్షించడానికి పిల్లలకు వదులుగా, పూర్తి స్లీవ్స్ దుస్తులు వేయాలి. ఇంట్లో దోమతెరలను వాడాలి.