తొక్కే కదాని తీసి పారేయకండి
అరటి పండు తొక్క తీస్తాం.. బంగాళదుంప పొట్టు తీస్తాం. దోసకాయ చెక్కు తీస్తాం. యాపిల్, నారింజ.. ఇలా ఎన్నో పండ్ల పొట్టు తీసేసి తింటాం.
By అంజి Published on 25 May 2023 8:15 AM GMTతొక్కే కదాని తీసి పారేయకండి
అరటి పండు తొక్క తీస్తాం.. బంగాళదుంప పొట్టు తీస్తాం. దోసకాయ చెక్కు తీస్తాం. యాపిల్, నారింజ.. ఇలా ఎన్నో పండ్ల పొట్టు తీసేసి తింటాం.. నిజానికి తొక్కల్లోనే 30 శాతం పీచు లభిస్తుంది. కండలో కన్నా యాంటీ ఆక్సిడెంట్లు పొట్టులోనే 328 రెట్లు ఎక్కువగా ఉంటాయి. వేటి పొట్టులో ఏ గుట్టుందో ఇప్పుడు చూద్దాం..
కివీ: గెట్టిగా, నూగుతో కూడినట్టు కనిపించే కివీని తొక్కతో తినొచ్చు. నూగును గీకేసి పొట్టుతోనే తినేయొచ్చు. దీనిలో ఫ్లేవనాయిడ్లు, యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ సి ఎక్కువగా ఉంటాయి.
మామిడి: వేసవి అంటేనే గుర్తొచ్చేది మామిడి. తోటలో పండినవి, సహజంగా మగ్గినవైతే తొక్కతో తినొచ్చు. ఇందులో పీచు అధికం. విటమిన్ ఇ, సి, యాంటీఆక్సిడెంట్లు, పాలీఫెనాల్స్, కెరొటినాయిడ్లూ కూడా ఎక్కువగా ఉంటాయి.
పుచ్చకాయ: పుచ్చకాయ గుజ్జుల్లో కన్నా తొక్కలోనే సిట్రులిన్ అనే ఆమైనో ఆమ్లం ఉంటుంది. రాత్రిపూట పుచ్చకాయ తొక్క రసం తాగితే హాయిగా పడుకోవచ్చు. జీర్ణక్రియను పెంచి బరువును నియంత్రిస్తుంది. ఇందులో యాంటీఆక్సిడెంట్లు వలన జుట్టు బలంగా తయారవుతుంది.
అరటి: అరటి పండు కూడా తొక్కతోనే తినాలా? అని అడుగుతారేమో. తొక్కలో ఉన్న పొటాషియం, ల్యూటీన్ యాంటీ ఆక్సిడెంట్లు కంటికి మేలు చేస్తాయి. బాగా మగ్గిన అరటి పండును తొక్కతో తిన్నా పెద్దగా ఇబ్బందేమీ లేదు.
యాపిల్: యాపిల్ పొట్టు మెదడు, ఊపిరితిత్తులపై బలంగా పని చేస్తాయి. విటమిన్ కె 332 శాతం, విటమిన్ ఎ 142 శాతం, విటమినస్ సి 115 శాతం, క్యాల్షియం 20 శాతం, పొటాషియం 19 శాతం ఎక్కువగా ఉంటుంది.
కీర దోస: దీన్ని పొట్టుతో తింటేనే మరింత బలం. తొక్కలోనే పొటాషియం, యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఎముకలు బలపడతాయి. పెరటి తోటలో పండిన కీర దోసలైతే కడిగితే చాలు. పొట్టుతోనే లాగించేయొచ్చు.