సాధారణంగా ఆరోగ్యకరమైన గోళ్లు లేత గులాబీ రంగులో ఉంటాయి. కొన్నిసార్లు మన చేతివేళ్లు రంగుమారడం, వాటిపై మచ్చలు ఏర్పటం వంటివి గమనిస్తుంటాం. ఇలా రంగు, ఆకృతిలో మార్పు అనేది మనలోని అనారోగ్యానికి, పోషకాల లోపానికి, వ్యాధులకు సంకేతమని నిపుణులు చెబుతున్నారు.
గోళ్లు పాలిపోయి తెల్లగా కనిపిస్తే రక్తహీనత, పోషకాహార లోపం, గుండె, కిడ్నీ సమస్యలు ఉన్నట్టు అర్థం చేసుకోవాలి. కాలేయ సంబంధిత సమస్యలు ఉన్నా ఈ లక్షణాలు కనిపిస్తాయట.
గోళ్లు ఫంగస్ ఇన్‌ఫెక్షన్ వల్ల కాకుండా పుసుపు రంగులోకి మారితే.. శరీరంలో థైరాయిడ్, ఊపిరితిత్తులు, షుగర్ సంబంధిత సమస్యలు ఉన్నట్టు సంకేతం.
శరీరానికి తగినంత స్థాయిలో ఆక్సిజన్ అందకపోతే గోళ్లు నీలం రంగులోకి మారుతాయి.
గోళ్లు కాస్త పసుపు రంగు కలిగి ఉండి.. విరిగిపోతున్నట్టయితే థైరాయిడ్ టెస్టులు చేయించుకోవాలి.
గోళ్లపై చిన్నచిన్న తెల్ల మచ్చలు వస్తుంటాయి. ఇవి మీ శరీరంలో కాల్షియం, పోషకాహార లోపాన్ని సూచిస్తాయి.
ఈ లక్షణాలు కనిపిస్తే ఒకసారి వైద్యుడిని సంప్రదించి అవసరమైన మెడికల్ టెస్టులు చేయించుకోవడం మంచిది.