ఎక్కువ రోజులు ఎలాంటి ఇబ్బంది లేకుండా బైక్‌ను నడపాలంటే చాలా విషయాలను దృష్టిలో పెట్టుకోవాలి. అదేవిధంగా బైక్ చైన్ విషయంలో అజాగ్రత్తగా ఉంటే బైక్ నడపడమే కష్టంగా మారుతుంది. బైక్ చైన్ విషయంలో ఎలాంటి జాగ్రత్తలు పాటించాలో తెలుసుకుందాం.
బైక్ నడుపుతున్నప్పుడు అనేక రకాల దుమ్ము, ధూళి చైన్‌సెట్‌పై చిక్కుకుంటాయి. అవి అలాగే టైన్‌పై పేరుకుపోతాయి. దీంతో చైన్ జీవితకాలం తగ్గుతుంది. అందువల్ల బైక్‌లోని చైన్‌సెట్‌ను ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి. ఇలా చేయడం వల్ల చైన్ సెట్ జీవితకాలం కూడా పెరుగుతుంది. చైన్‌సెట్‌ను శుభ్రంగా ఉంచడానికి బ్రష్‌లు, స్ప్రేలను ఉపయోగించవచ్చు.
చైన్‌ను శుభ్రపరచడంతో పాటు, దానిని సరిగ్గా లూబ్రికేట్ చేయడం కూడా ముఖ్యం. 500, 1000 కిలోమీటర్ల మధ్య గొలుసును సరిగ్గా శుభ్రం చేయడంతో లూబ్రికేట్(ఆయిలింగ్) చేయడం చాలా ముఖ్యం. ఇలా చేయడం వల్ల గొలుసుపై రక్షిత పొర లాగా లూబ్రికేంట్ ఉంటుంది. దీని కారణంగా చైన్ త్వరగా దెబ్బతినదు.
చైన్‌ను లూబ్రికేట్ చేసిన వెంటనే బైక్ నడపకూడదు. బైక్‌ను కొంత సమయం పాటు ఒకే చోట పార్క్ చేయాలి. అలా చేయడం వల్ల ఆయిల్ సరిగ్గా ఆరుతుంది. దీని కారణంగా చైన్ ఎక్కువకాలం మన్నికగా ఉంటుంది.
బైక్ ఎక్కువగా నడపడం వల్ల చైన్ లూజ్ అవుతుంది. గొలుసు మరీ వదులుగా ఉండడంతో తెగిపోయే ప్రమాదం ఉంది. అందువల్ల చైన్‌ను ఎప్పటికప్పుడు సర్దుబాటు చేయాలి. చైన్ వదులుగా ఉంటే.. దానిని బిగించాలి. గొలుసు వదులుగా ఉంటే.. శబ్దం వస్తుంది. అటువంటి పరిస్థితిలో దానిని సరిగ్గా బిగించాల్సివుంటుంది.