గర్భం దాల్చిన తర్వాత హార్మోన్లలలో వచ్చే మార్పుల కారణంగా వాంతులు, వికారం ఉంటాయి. ప్రెగ్నెన్సీ మొదలైన 4 నుంచి 7 వారాల్లోపు వేవిళ్ల లక్షణాలు ప్రారంభం అవుతాయి. 20వ వారం వచ్చేసరికి 90 శాతం మహిళల్లో వేవిళ్లు తగ్గుతాయి. చాలా మందిలో వేవిళ్లు ఎక్కువగా ఉంటాయి. వాంతులు విపరీతంగా అవడాన్ని హైపర్ ఎమెసిస్ అంటారు. ఈ పరిస్థితి 5 శాతం మంది గర్భిణుల్లో కనిపిస్తుంది. దీంతో వారు ఏం తినడానికీ ఆసక్తి చూపరు. ఏమీ తినకపోవడం వల్ల నీరసం కలుగుతుంది. ఇది మూడ్ మీదా ప్రభావం చూపుతుంది. డిప్రెషన్‌కు గురవుతారు. ఈ వాంతుల తీవ్రతను అంచనా వేయడానికి ఒక స్కోరింగ్ పద్ధతి ఉంది.
గర్భిణీలో కనిపించే లక్షణాలు, శారీరక పరీక్షా ఫలితాలు, మూత్ర, రక్త పరీక్షా ఫలితాలను క్రోడీకరించి స్కోరింగ్ వేస్తారు. దీన్ని ప్రెగ్నెన్సీ యూనిక్ క్వాంటిఫికేషన్ ఆఫ్ ఎమెసిస్ అంటారు. వాంతులు ఎక్కువగా అవ్వడం వల్ల బిడ్డ తక్కువ బరువుతో పుట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి కార్బొహైడ్రేట్లు ఎక్కువగా, కొవ్వ పదార్థాలు తక్కువగా ఉండే ఆహారం తీసుకోవాలి. ఆక్యుప్రెజర్ పాయింట్లపై ఒత్తిడి పెట్టాలి. వాంతులు దీర్ఘకాలం కొనసాగుతుంటే హాస్పిటల్లో చేర్పించి చికిత్స చేయించాలి. వాంతులు తగ్గేందుకు ఇంజెక్షన్లు, డీహైడ్రేషన్ సరిచేసేందుకు సెలైన్ ఎక్కించాల్సి ఉంటుంది.