గర్భిణులు తప్పనిసరిగా తీసుకోవాల్సిన ఆహారం ఇదే
గర్భంతో ఉన్నప్పుడు తల్లి తీసుకునే ఆహారం శిశువు ఎదుగుదలలో అత్యంత ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ఈ సమయంలో గర్భవతి పౌషికాహారం తీసుకోవడం చాలా అవసరం.
By - అంజి |
గర్భిణులు తప్పనిసరిగా తీసుకోవాల్సిన ఆహారం ఇదే
గర్భంతో ఉన్నప్పుడు తల్లి తీసుకునే ఆహారం శిశువు ఎదుగుదలలో అత్యంత ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ఈ సమయంలో గర్భవతి పౌషికాహారం తీసుకోవడం చాలా అవసరం. గర్భవతిగా ఉన్న సమయంలో తీసుకోవాల్సిన ఆహారం గురించి ఇక్కడ వివరంగా తెలుసుకుందాం..
పండ్లు, కూరగాయలు
తాజా పండ్లు, ఉడికించిన కూరగాయలు ఆహారంలో భాగం చేసుకోవడం చాలా అవసరం. తాజా పండ్లలో ఫైబర్ అధికంగా ఉంటుంది. అలాగే క్యాబేజీ, క్యాలీఫ్లవర్ వంటి వాటిలో కూడా ఫైబర్ అధికంగా ఉంటుంది. అయితే కూరగాయలను ఖచ్చితంగా ఉడకబెట్టిన తర్వాతే తీసుకోవడం మంచిది. పచ్చి కూరగాయలను తీసుకోవడం వల్ల వాటిలో ఉండే బాక్టీరియా తల్లి ఆరోగ్యానికి ప్రమాదకరంగా మారవచ్చు.
ఓట్స్, మిల్లెట్స్
చిరు ధాన్యాలు మంచి పౌష్టిక ఆహారం. గర్భధారణ సమయంలో చిరు ధాన్యాలను, ఓట్స్‌ను ఆహారంలో భాగంగా చేసుకుంటే ఆరోగ్యం బావుంటుంది.
పాలు, పాల పదార్థాలు
ప్రెగ్నెన్సీ సమయంలో తల్లి, శిశువు ఇద్దరికీ కాల్షియం అవసరం అవుతుంది. పాలల్లో ఉండే కాల్షియం శిశువు ఎదుగుదలకు, ఎముకల ధృడత్వానికి ఉపయోగపడుతుంది. తల్లికి పాలు తాగే అలవాటు లేకపోతే పనీర్ ఆహారంలో భాగంగా తీసుకోవచ్చు. సోయా పాలు కూడా తీసుకోవచ్చు.
డ్రై ఫ్రూట్స్
గర్భంలో శిశువు ఉన్నప్పుడు బాదం, ఎండు ఖర్జూరం, ఎండు ద్రాక్షతో పాటుగా వివిధ రకాలైన డ్రై ఫ్రూట్స్ తీసుకోవడం వల్ల తల్లీబిడ్డలకు అవసరమైన ఐరన్ పుష్కలంగా లభిస్తుంది. అంతేకాకుండా ప్రతీరోజూ కొద్ది మోతాదులో తీసుకోవడం ద్వారా రక్తహీనత సమస్యలు ఏర్పడకుండా నివారించవచ్చు.
గుడ్లు, మాంసం: గుడ్లు, చికెన్, మటన్, చేపలు వంటి మాంసాహారం ద్వారా కూడా ఐరన్ అధికంగా లభిస్తుంది. వీటిని ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల శిశువు ఎదుగుదల బావుంటుంది