పాలను సంపూర్ణ ఆహారం అని పిలుస్తారు. దీనిలో ఉండే కాల్షియం, ప్రొటీన్, విటమిన్లు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. పాలను మరిగించిన తర్వాతే తీసుకోవాలి. అప్పుడే దానిలో బ్యాక్టీరియా నశిస్తుంది. అయితే పాలు మరిగించేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే దానిలో పోషకాలు మనకు పూర్తిగా అందుతాయని నిపుణులు చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు చూద్దాం..
చాలా మంది గ్యాస్ స్టవ్ మంట చిన్నదిగా వచ్చేలా ఉంచి పాలను ఎక్కువసేపు మరిగిస్తుంటారు. ఇలా చాలా సేపు పాలను మరిగిస్తే వాటిలో పోషకాలు నశించిపోతాయి.
మరికొందరు పాలు పాడవకుండా ఉండేందుకు రోజులో అనేకసార్లు మరిగిస్తారు. అలా కాకుండా పాలను ఒక్కసారే మరిగించి తాగే ముందు మరోసారి కొద్దిగా వేడిచేస్తే సరిపోతుంది.
కొందరు గ్యాస్ స్టవ్ హై-ప్లేమ్‌లో పెట్టి పాలను వేగంగా మరిగిస్తారు. ఇది కూడా మంచిది కాదని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. ఇలా చేస్తే ప్రోటీన్లు ఒకే చోటుకు చేరిపోయి సరైన పోషకాలు శరీరానికి అందవట.
పాలను మీడియం ఫ్లేమ్‌లో పెట్టి మరిగిస్తూ అప్పుడప్పుడు చెంచా లేదా గరిటెతో కలిపితే సరిపోతుంది. అప్పుడు దానిలోని కొవ్వు, నీరు, కార్బొహైడ్రేట్లు, ప్రొటీన్లు కలిసి అన్ని రకాల పోషకాలు మనకు అందుతాయి.