ఆరోగ్యానికి అల్లం మంచిదని తెలిసినా చాలా మంది తినడానికి ఇష్టపడరు. మన ఇంట్లో తయారు చేసే కొన్ని ఆహార పదార్థాల్లో, టీ లలో అల్లం వేస్తుంటారు. అయితే కేవలం జలుబు, తలనొప్పిని మాత్రమే కాకుండా భయంకరమైన కొన్ని రకాల క్యాన్సర్లను అడ్డుకునే శక్తి అల్లానికి ఉందని అనేక పరిశోధనల్లో తేలింది. అండాశయ క్యాన్సర్ కణాలతో పోరాడే గుణాలు అల్లంలో ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అలాగే ప్రొస్టేట్ క్యాన్సర్ నివారణలో కూడా అల్లం తోడ్పడుతుందని.. ఇది ప్రొస్టేట్ గ్రంథిలోని ఆరోగ్య కరమైన కణాలను చేయకుండా కేవలం క్యాన్సర్ కణాలను మాత్రమే చంపేస్తోందని ఓ పరిశోధనలో తేలింది.
అల్లంలో గర్భాశయ క్యాన్సర్ నిరోధక గుణాలు ఉన్నట్టు మిచిగాన్ యూనివర్సిటీ తాజా పరిశోధనల్లో తేలింది. అల్లంను ప్రతి రోజూ ఆహారంలో భాగం చేసుకుంటే కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనం కలుగుతుంది. మైగ్రేన్‌కి కారణమైన ప్రోస్టాగ్లాండిన్ల ఉత్పత్తిని అల్లం సమర్థంగా అడ్డుకుంటుంది. రుతుస్రావ సమయంలో స్త్రీలు అల్లం టీ తాగితే కడుపునొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది. అల్లాన్ని ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల ఒత్తిడి తగ్గడంతో పాటు రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. దగ్గు, జలుబు, గొంతు నొప్పి నుంచి త్వరగా కోలుకోవడానికి అల్లం ఉపయోగపడుతుంది. ఉదయాన్నే టిఫిన్ చేసి ఒక అల్లం టీ తాగితే వీటి నుంచి ఉపశమనం కలుగుతుంది.