ఊబకాయం నుంచి బయటపడాలంటే..

నేడు చాలా మంది ఎదుర్కొంటున్న సమస్యల్లో ఊబకాయం ఒకటి. మారుతున్న జీవనశైలి, జంక్‌ ఫుడ్స్‌ తినడం, వ్యాయామం లేకపోవడం, కొన్ని ఆరోగ్య సమస్యలు కారణంగా చాలా మంది బరువు పెరుగుతున్నారు.

By అంజి
Published on : 4 Jun 2025 11:22 AM IST

obesity, Health Tips, Life style

ఊబకాయం నుంచి బయటపడాలంటే..

నేడు చాలా మంది ఎదుర్కొంటున్న సమస్యల్లో ఊబకాయం ఒకటి. మారుతున్న జీవనశైలి, జంక్‌ ఫుడ్స్‌ తినడం, వ్యాయామం లేకపోవడం, కొన్ని ఆరోగ్య సమస్యలు కారణంగా చాలా మంది బరువు పెరుగుతున్నారు. ఈ సమస్య నుంచి బయటపడేందుకు ఎలాంటి చిట్కాలు పాటించాలో ఇప్పుడు చూద్దాం..

భోజనానికి ముందు ఒక గ్లాసు నీళ్లు తాగితే.. అది ఆకలిని తగ్గించి కడుపు నిండిన భావన కలిగించి తక్కువ తినేలా చేస్తుంది. అలాగే జీర్ణశక్తి మెరుగుపడుతుంది. ప్రోటీన్‌లు అధికంగా ఉండే ఆహార పదార్థాలు తింటే కడుపు ఎక్కువ సమయం నిండుగా ఉండే అనుభూతి కలిగి ఎక్కువగా ఆకలి వేయదు.

సరైన నిద్ర లేకపోవడం వల్ల హార్మోన్ల స్థాయిల్లో హెచ్చుతగ్గులు ఏర్పడతాయి. ఇది అతిగా తినడానికి దారి తీస్తుంది. ప్రతి రోజు 7 నుంచి 9 గంటలు నిద్రపోతే హార్మోన్ల స్థాయి సక్రమంగా ఉండి బరువు కంట్రోల్‌లో ఉంటుంది.

ప్రాసెస్‌ చేసిన ఆహారాలు, అనేక రకాలా జంక్‌ ఫుడ్స్‌ ఆరోగ్యానికి హానికరం. అధికంగా చక్కెర కలిగిన ఆహార పదార్థాలు, కూల్‌ డ్రింక్స్‌ కూడా బరువు పెరగడానికి కారణం అవుతాయి. అందుకే వాటిని దూరం పెట్టడం మంచిది.

క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వల్ల మన శరీరంలో పరిమితికి మించి నిల్వ ఉన్న కొవ్వులు కరుగుతాయి. బాడీలో కొవ్వు పరిమాణం తగ్గించడానికి వ్యాయామాలు, యోగా, ఆటలు సహకరిస్తాయి.

మనం తీసుకునే ఆహారం కూడా మన ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది. ఆయిల్‌ ఫుడ్స్‌కు దూరంగా ఉండి బరువు తగ్గడానికి అవసరమైన పోషకాలను అందించే పండ్లు, కూరగాయలు, గింజలు లాంటి స్నాక్స్‌ను ఎంచుకోవాలి.

దీర్ఘకాలిక ఒత్తిడి హార్మోన్స్‌ అసమతుల్యత, ఆకలిపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ఒత్తిడిలో ఉన్నప్పుడు అతిగా తినడం బరువు పెరగడానికి దారి తీస్తుంది. అందుకే ఒత్తిడిగా ఉన్నట్టు అనిపిస్తే ధ్యానం, యోగా, వ్యాయామం చేయాలి. ఇది తీవ్ర స్థాయికి చేరుతోందనిపిస్తే మానసిక వైద్యుడిని కలవడం ఉత్తమం.

Next Story