పప్పు దినుసులను ఇలా తింటే.. ఆరోగ్యానికి బోలేడు బెనిఫిట్స్
పప్పుల్ని రోజువారీ ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల బోలెడన్ని ఆరోగ్య ప్రయోజనాలు చేకూరతాయంటున్నారు నిపుణులు.
By - అంజి |
పప్పు దినుసులను ఇలా తింటే.. ఆరోగ్యానికి బోలేడు బెనిఫిట్స్
పప్పుల్ని రోజువారీ ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల బోలెడన్ని ఆరోగ్య ప్రయోజనాలు చేకూరతాయంటున్నారు నిపుణులు. మన దేశంలో సుమారు 65 వేల రకాల పప్పులు, కాయధాన్యాలు అందుబాటులో ఉన్నాయి. కాబట్టి వారానికి కనీసం ఐదు రకాలనైనా ఆహారంలో భాగం చేసుకుంటే అటు వాటిలోని పోషకాలు శరీరానికి అందుతాయి.. అలాగే వాటి రుచినీ ఆస్వాదించచ్చు.
మొలకలెత్తించాలి!
చాలామందికి పప్పుల్ని నేరుగా వండుకోవడం లేదంటే వివిధ వంటకాల్లో భాగం చేసుకోవడం అలవాటు. కానీ ముందు వీటిని నానబెట్టి, మొలకలొచ్చాక వండుకునే వారు చాలా తక్కువ మంది ఉంటారు. కానీ ఇలా చేయడం వల్ల యాంటీ న్యూట్రియంట్లను విచ్ఛిన్నం చేసే ఎంజైమ్‌లను ప్రేరేపించచ్చు. ఎందుకంటే పప్పుల్లో ఉండే పోషకాల్ని శరీరం గ్రహించకుండా ఈ యాంటీ న్యూట్రియంట్లు అడ్డుపడతాయి. అదే నానబెట్టి, మొలకలెత్తించిన పప్పుల్లో వీటి శాతం తగ్గిపోతుంది. తద్వారా సూక్ష్మ పోషకాలు, ప్రొటీన్.. వంటివి శరీరానికి అందుతాయి. అరుగుదల మెరుగుపడి వివిధ రకాల జీర్ణ సంబంధిత సమస్యలు తలెత్తకుండా జాగ్రత్తపడచ్చు.
వీటితో కలిపి తింటే బెటర్
పప్పుల్ని బియ్యంతో కంటే చిరుధాన్యాలు, కాయధాన్యాలతో కలిపి తీసుకోవడం బెటర్. ఎందుకంటే వీటి లోని అత్యవసర అమైనో ఆమ్లాలతో పోల్చితే అనవసర అమైనో ఆమ్లాల శాతాన్ని తగ్గించవచ్చు. అదెలాగంటే.. వాటిని బియ్యంతో కలిపినప్పుడు ఈ నిష్పత్తి 1:3గా ఉంటే, అదే.. చిరుధాన్యాలు, కాయధాన్యాలతో కలిపినప్పుడు 1:2కు తగ్గుతుంది. తద్వారా వాటిలోని సుగుణాలన్నీ శరీరం గ్రహించే సామర్థ్యం పెరుగుతుంది. ఫలితంగా ఎముకలు దృఢంగా మారతాయి. శరీరంలో యాంటీ బాడీస్ ఉత్పత్తై రోగనిరోధక శక్తి మెరుగుపడుతుంది. అంతేకాదు.. చిన్న వయసులోనే జుట్టు నెరిసిపోకుండా జాగ్రత్తపడచ్చు.
పప్పులతో ప్రయోజనాలెన్నో!
* పప్పుల్లో ఉండే పొటాషియం రక్తప్రసరణను అదుపులో ఉంచుతుంది. అలాగే శరీరంలో కొవ్వు స్థాయులు తగ్గేలా చేసి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.
* వీటిలోని ఫైబర్, ప్రొటీన్లు కడుపు నిండుగా ఉండేలా చేసి ఆకలిని అదుపు చేస్తాయి. తద్వారా ఏది పడితే అది తినకుండా బరువును అదుపులో ఉంచుకోవచ్చు.
* కాయధాన్యాలు, పప్పులు తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ విలువ కలిగి ఉంటాయి. తద్వారా రక్తంలో చక్కెర స్థాయులు పెరగకుండా జాగ్రత్తపడచ్చు. కాబట్టి వీటిని తరచూ తీసుకోవడం వల్ల మధుమేహం బారిన పడే అవకాశాలు చాలా తక్కువంటున్నారు నిపుణులు.