చల్లని లేదా వేడి పదార్థాలు తిన్నప్పుడు కొంతమందిలో పళ్లు జివ్వుమని లాగడం జరుగుతుంది. దీనికి కారణం పళ్ల మీద ఎనామిల్ పొర ఉంటుంది. ఇది పళ్లను రక్షించే ఒక కవచం. ఎనామిల్ పొర కింద డెంటింగ్ అనే పొర ఉంటుంది. సాధారణంగా ఎనామిల్ పొర వయసు పెరుగుదలతో పాటు పలుచబడుతుంది. కానీ, కొంతమందిలో వంశపారంపర్యంగా చిన్న వయసులోనే ఎనామిల్ పొర పలుచబడి డెంటల్ పొర బహిర్గతం అవుతుంది.
అంతే కాకుండా గట్టిగా బ్రష్ చేయడం, క్యావిటీల కారనంగా కూడా ఎనామిల్ పొర అరిగిపోతుంది. కూల్‌డ్రింక్స్, స్వీట్స్, కేక్స్ వంటివి తినడం వల్ల ఎనామిల్ పొరకు హాని జరిగి దాని కింద ఉన్న డెంటింగ్ పొర బహిర్గతం కావడం వల్ల వేడి లేదా చల్లని పదార్థాలు తిన్నప్పుడు పళ్లు జివ్వుమని లాగుతాయి. తరుచుగా చల్లని లేదా వేడి పదార్థాలు తిన్నప్పుడు పళ్లు జివ్వుమనడం సంభవిస్తే డెంటిస్ట్‌ను సంప్రదించాలి. వారు సూచించే టూత్ పేస్ట్, మందులను వాడటం వల్ల ఈ సమస్య నుంచి బయటపడొచ్చు.
ఈ సమస్య మరీ తీవ్రంగా ఉంటే ఉపశమనం కోసం సాధారణంగా పళ్లకు సిమెంట్ వేయడం, రసాయనాలతో పంటి ఎనామిల్ దెబ్బతిన్న ప్రాంతాలను రక్షించేలా వైద్యులు ఒక ప్రత్యేక పొరను ఏర్పాటు చేస్తారు. అందుకే ఈ సమస్య ఉంటే నిర్లక్ష్యం చేయవద్దు.