మనకు అనారోగ్యంగా ఉన్నప్పుడు నీరసంగా అనిపిస్తే తక్షణ శక్తి కోసం చాలా మంది కొబ్బరి నీళ్లు తాగుతుంటారు. కొందరు ఒంట్లో వేడి చేసినప్పుడు కూడా కొబ్బరినీళ్లు తాగితే ఉపశమనం లభిస్తుందని భావిస్తారు. అయితే లేత కొబ్బరి బొండాలోని నీళ్ల వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి. ఈ నీటిని ఏ సందర్భంలో తాగితే ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయో తెలుసుకుందాం..
మనకు ఎక్కువగా వేడి చేసినట్టు అనిపిస్తే కొబ్బరి నీళ్లను ఉదయాన్నే పరగడపున తాగడం వల్ల చలవ చేస్తుంది. శరీరానికి సాంత్వన లభిస్తుంది.
భోజనం చేసిన కాసేపటి తర్వాత కొబ్బరి నీటిని తాగితే ఆహారం మెరుగ్గా జీర్ణం అవుతుంది. పొట్ట ఉబ్బరం లాంటి సమస్యలు తలెత్తకుండా ఉంటాయి.
నిద్రపోయే ముందు కొబ్బరి నీళ్లను తాగితే ఆందోళన, ఒత్తిడి తగ్గి మెదడు ప్రశాంతంగా మారుతుంది. అలాగే శరీరంలో పేరుకుపోయిన వ్యర్థాలు కూడా బయటకు వెళ్లిపోతాయి.
క్రీడాకారులు ప్రాక్టీస్ సమయంలో ఎనర్జీ డ్రింక్స్‌కు బదులు కొబ్బరి బోండా నీళ్లు తాగితే తిరిగి శక్తిని పొందవచ్చు. కొబ్బరి నీళ్లను తాగితే పిల్లల్లో మానసిక, శారీరక ఎదుగుదల బాగుంటుంది.