మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత కాసేపు నిద్రపోవడం కొందరికి అలవాటు. అయితే ఇది మంచి అలవాటా? కాదా? అన్న సందేహం చాలా మందిలో ఉంటుంది. మధ్యాహ్న భోజనం తర్వాత కాసేపు నిద్రపోతే అప్పటి వరకు పని అలసట దూరమై కొత్త ఉత్సాహంతో మరింత పని చేయడానికి అవకాశం ఉంటుంది. అయితే ఈ నిద్ర మితిమీరితే ఆరోగ్యానికి హాని తప్పదని నిపుణులు అంటున్నారు.
మధ్యాహ్నం ఎక్కువసేపు నిద్రపోతే అది రాత్రి నిద్రను ప్రభావితం చేస్తుంది. రాత్రి నిద్ర తక్కువైతే అధిక రక్తపోటు, డయాబెటిస్, గుండె జబ్బులు, ఆందోళన లాంటి ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది.
మెడికల్ జర్నల్ ఆఫ్ అమెరికన్ అకాడమీ ఆఫ్ న్యూరాలజీ అధ్యయనం ప్రకారం.. మధ్యాహ్నం ఎక్కువ సమయం నిద్రపోవడం వల్ల స్ట్రోక్ వచ్చే ప్రమాదం 20 శాతం కంటే ఎక్కువ పెరుగుతుందని వెల్లడి అయ్యింది.
మధ్యాహ్నం 90 నిమిషాల కంటే ఎక్కువసేపు నిద్రపోయే వారికి పక్షవాతం వచ్చే ముప్పు 25 శాతం ఉంటుందని తేలింది. వృద్ధులు, అనారోగ్యంగా ఉన్న వారు పగటిపూట గరిష్ఠంగా 90 నిమిషాల పాటు, మిగిలిన వారు అరగంట లోపు మాత్రమే పడుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.