వర్షాకాలంలో మొక్కజొన్న పొత్తులు మార్కెట్‌లోకి ఎక్కువగా వస్తుంటాయి. అయితే ప్రస్తుతం కాలంతో సంబంధం లేకుండా స్వీట్ కార్న్ ఎప్పుడూ మార్కెట్‌లో అందుబాటులో ఉంటున్నాయి. ఇవి కేవలం రుచిగా ఉండటమే కాదు.. ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తాయి.
స్వీట్ కార్న్‌లో ఫైబర్ సహా మన శరీరానికి అవసరమైన విటమిన్ ఏ, బీ-కాంప్లెక్స్, సీతో పాటు పొటాషియం, మాంగనీస్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. మొక్కజొన్నలోని పీచు పదార్థం జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది. మలబద్ధకాన్ని నిరోధిస్తుంది. మొక్కజొన్నలో ఉండే సహజ చక్కెర, కార్బోహైడ్రేట్లు శరీరానికి తాజాదనాన్ని, శక్తిని ఇచ్చి మిమ్మల్ని చురుకుగా ఉంచుతుంది.
మొక్కజొన్నలో లభించే ఫోలిక్ ఆమ్లం, మెగ్నీషియం గుండెకు మేలు చేస్తాయి. ఇది రక్తపోటును నియంత్రించడంలో, చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో సహాయపడుతుంది. దీనిలోని ఫైబర్ వల్ల కొంచెం తిన్నా కడుపు నిండిన ఫీల్ కలుగుతుంది. దీంతో ఎక్కువ మొత్తంలో ఆహారం తీసుకోవాల్సిన అవసరం ఉండదు. కాబట్టి మొక్కజొన్న పొత్తు తినడం వల్ల బరువు తగ్గడానికి అవకాశాలు ఉంటాయి. స్వీట్‌కార్న్‌ను ఎక్కువ బటర్, ఉప్పు, నూనెతో కలిపిన పదార్థాలతో కలిపి తీసుకోవడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు. దీన్ని ఉడికించి నేరుగా తీసుకోవడం మంచిది.