డోనాల్డ్ ట్రంప్‌నకు విషంతో కూడిన పార్సిల్‌

By తోట‌ వంశీ కుమార్‌  Published on  20 Sep 2020 6:06 AM GMT
డోనాల్డ్ ట్రంప్‌నకు విషంతో కూడిన పార్సిల్‌

అమెరికా అధ్యక్ష ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అమెరికా అధ్యక్ష భవనం వైట్‌ హౌజ్‌లో విషం కలకలం రేపింది. గుర్తు తెలియని వ్యక్తులు విషంతో కూడిన ఓ పార్మిల్‌ను వైట్‌హౌజ్‌ చిరునామాతో పంపారు. రిసిన్‌ విషం పూసిన లేఖను అధికారులు గుర్తించి అక్కడే నిలిపివేశారు. ఈ పార్సిల్ కెనడా నుంచి వచ్చినట్టు భావిస్తున్నామని రాయల్ కెనడియన్ మౌంటెడ్ పోలీస్ విభాగం తెలిపింది. అనుమానాస్పదంగా ఉన్న ఈ కవర్ వైట్ హౌస్ కి చేరక ముందే ప్రభుత్వ మెయిల్ సెంటర్ లో అధికారులు దీన్ని స్వాధీనం చేసుకుని పరిశీలించారు. ప్రస్తుతానికి దీనివల్ల ఎవరికీ ఎలాంటి ప్రమాదం లేదని వారు చెప్పారు. వైట్ హౌస్ గానీ, యుఎస్ సీక్రెట్ సర్వీసు గానీ దీనిపై వ్యాఖ్యానించేందుకు నిరాకరించాయి. ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అధికారులు ఈ పార్సిల్ వ్యవహారంపై దర్యాప్తు ప్రారంభించారు.

ఈ లేఖపై పూసిన రిసిన్.. అత్యంత ప్రమాదకరమైన విషం. దీన్ని జీవాయుధంగా కూడా వినియోగించవచ్చు. దీన్ని తీసుకున్న 36 నుంచి 72 గంటల్లోగా మరణం తప్పదని, ఈ విషానికి ఇంతవరకూ యాంటీ డోస్ కనుగొనబడలేదని శాస్త్రవేత్తలు, వైద్య నిపుణులు తెలిపారు. యూఎస్ అధికార గణాంకాల ప్రకారం, రిసిన్ పూసిన లేఖలను అందుకున్న ఎంతో మంది అమెరికన్లకు మరణాలు సంభవించాయి. గతంలో కూడా ఇలాంటి తరహా లేఖలు వచ్చాయి. 2014లో అప్పటి అధ్యక్షుడు బరాక్‌ ఒబామాకు మిస్సిసిపీకి చెందిన ఓ అధికారి రిసిన్‌తో రుద్దిన లేఖను పంపారు. అధికారులు ముందే గుర్తించడంతో ప్రమాదం తప్పింది. అతడికి 25 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ అక్కడి కోర్టు తీర్పు వెలువరించింది. అయితే అధ్యక్ష ఎన్నికల ముందు ఇలాంటి ప్రయోగం జరగడం అధికారులను కలవరపెడుతోంది. తాజా ఘటనతో ట్రంప్ భద్రతా బృందం మరింత అప్రమత్తమైంది.

Next Story