ఆదివారం నుంచి అమెరికాలో టిక్‌టాక్ పై నిషేదం.. చైనా స్పందన ఏంటంటే..?

By తోట‌ వంశీ కుమార్‌  Published on  19 Sep 2020 6:20 AM GMT
ఆదివారం నుంచి అమెరికాలో టిక్‌టాక్ పై నిషేదం.. చైనా స్పందన ఏంటంటే..?

కరోనా వైరస్‌ కారణంగా అగ్రరాజ్యం అమెరికా చిగురుటాకులా వకిణిపోతోంది. ప్రపంచంలో అత్యధిక కరోనా పాజిటివ్‌ కేసులు అమెరికాలోనే నమోదు అవుతున్నాయి. ఈ మహమ్మారికి కారణం చైనాయేనని మొదటి నుంచి ఆగ్రహాంగా ఉన్న అగ్రరాజ్యం.. తాజాగా మరోసారి డ్రాగన్‌ కంట్రీకి షాకిచ్చింది. చైనాకు చెందిన టిక్‌టాక్‌, వీచాట్‌ యాప్‌లను నిషేధిస్తున్నామని ప్రకటించింది. ఆదివారం నుంచి ఈ రెండు యాప్‌ల డౌన్‌లోడ్‌లను నిలిపివేయనున్నట్టు అమెరికా వాణిజ్య విభాగం వెల్లడించింది.

జాతీయ భద్రతా కారణాల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్టు అమెరికా వెల్లడించింది. చైనీస్ కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో నడిచే కంపెనీల యాప్ లను ఉపయోగించడం వల్ల జాతీయ భద్రతకు ప్రమాదం పొంచి ఉందని.. దేశ ఆర్ధిక వ్యవస్థ, విదేశాంగ విధానం వంటి అంశాలపై ప్రభావం చూపకూడదనే ఉద్దేశ్యంతో నిషేధిస్తున్నట్టు అమెరికా ప్రభుత్వం పేర్కొంది. అమెరికా-చైనాల మధ్య దౌత్య, వాణిజ్య యుద్ధం ముదిరిన నేపధ్యంలో ఈ నిర్ణయం వెలువడింది.

వాస్తవానికి ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం పొందిన టిక్‌టాక్ ను అమెరికాకు చెందిన కంపెనీకు విక్రయించాలని.. లేదంటే నిషేధిస్తామని గతంలోనే ట్రంప్ హెచ్చరించారు. దాంతో ముందు మైక్రోసాఫ్ట్ సంస్థ కొనుగోలు కోసం ప్రయత్నించినా చర్చలు ఫలించలేదు. అనంతరం మరో అమెరికన్ కంపెనీ ఒరాకిల్ ప్రయత్నించింది. టిక్ టాక్ మాతృసంస్థ అయిన బైట్ డ్యాన్స్ తో చర్చలు జరిపింది. బైట్ డ్యాన్స్ కు మెజార్టీ వాటా, ఒరాకిల్ కు మైనర్ వాటా ఉండేలా ఒప్పందం కుదరాల్సి ఉంది. ఇలాంటి ఒప్పందాన్ని తన దేశంలో అనుమతించనని ట్రంప్ స్పష్టం చేయడంతో అది కూడా ఆగిపోయింది.

స్పందించిన చైనా..

కాగా.. దీనిపై శనివారం చైనా స్పందించింది. అమెరికా బెదిరింపు చర్యలకు పాల్పడుతోందని ఆరోపించింది. ఈ మేరకు చైనా వాణిజ్య మంతత్రిత్వ శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. ‘బెదిరింపులను మానుకోవాలని, తప్పుడు చర్యలను నిలిపివేయాలని.. న్యాయమైన, పారదర్శక అంతర్జాతీయ నియమాలను, ఆర్డర్లను ఖచ్చితంగా పాటించాలని చైనా.. అమెరికాను కోరుతోందని తెలిపింది. అంతేకాక అమెరికా తనదైన మార్గంలో వెళ్లాలని పట్టుబడుతుంటే, చైనా కంపెనీల చట్టబద్ధమైన హక్కులు, ప్రయోజనాలను కాపాడటానికి అవసరమైన చర్యలు తీసుకుంటామని పేర్కొంది.

Next Story