సియాచిన్ అంచుల్లో విహరిద్దాం..పదండి!

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  23 Oct 2019 11:45 AM GMT
సియాచిన్ అంచుల్లో విహరిద్దాం..పదండి!

ప్రపంచంలోనే ఎత్తయిన మంచు పర్వత యుద్ధ భూమిని చూడాలనుకుంటున్నారా, భారత సైన్యానికి కీలకమైన ప్రదేశాన్ని చూసి సైన్యం మాత్రమే తిరగగల యుద్ధ క్షేత్రంలో కాసేపైనా గడపాలనుకుంటున్నారా..అయితే మీ కోసమే కేంద్ర ప్రభుత్వం ఒక అద్భుత అవకాశాన్ని ఇచ్చింది. సియాచిన్ ఆర్మీ బేస్ వరకు టూరిస్ట్‌లకు అవకాశం కల్పిస్తున్నామని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ప్రకటన నేపథ్యంలో సియాచిన్‌కు అంత ప్రాముఖ్యత ఎందుకో తెలుసుకుందాం..

Siachin 4

సియాచిన్.. పర్యాటకులకు, పర్వతారోహణకు డ్రీమ్ డెస్టినేషన్ అని చెప్పుకోవచ్చు. ఇక్కడ మైనస్ 18 నుంచి 60 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. సైనికులు మాత్రమే ఉండగల అత్యంత ప్రమాదకర ప్రాంతం కూడా. అతిశీతల వాతావరణంతో పాటు, అడపాదడపా వచ్చిపడే అతి భీకర తుఫానులు కూడా దడ పుట్టిస్తాయి. అయినా సరే ఎంతో ఇష్టంగా, కష్టంగా హిమాలయ పర్వత పర్వతాన్ని అధిరోహించిన వారు సైతం సియాచిన్ అంచులను తాకాలని తహ తహలాడుతారు. ఒకవైపు చైనా మరోవైపు పాక్ ఆక్రమిత కాశ్మీర్ మధ్య ఉండే చిన్న ప్రాంతం ఇది. అత్యంత కఠిన శిక్షణ పొందిన సైనికులు మాత్రమే ఇక్కడ ఉండగలిగే పరిస్థితి. కార్గిల్ యుద్ధ సమయంలో ఈ ప్రదేశం కీలక పాత్ర పోషించింది. ఇప్పటి దాకా సియాచిన్ గ్లేసియర్‌ను స్థానికులు కూడా సందర్శించ లేదంటేనే తెలుస్తుంది ఈ ప్రాంతం ఎంత ప్రత్యేకమైనదో. రెండు వివాదాస్పద దేశాలతో సరిహద్దులను పంచుకుంటుండటం వల్ల ఈ ప్రాంతాన్ని తమ ఆధీనంలో ఉంచుకుంది సైన్యం. ఎంపిక చేసిన కొంతమంది వ్యక్తులు తప్ప ఇతరులెవరూ ఇప్పటి వరకు ఆ ప్రాంతాన్ని చూసిందే లేదు. అయితే ఇదంతా ఒకప్పటి మాట. ఇప్పుడు ఈ ప్రాంతం సామాన్యులకు కూడా స్వాగతం పలుకుతోంది. మన ఆర్మీ ఎటువంటి క్లిష్ట పరిస్థితుల్లో గడుపుతూ ఉంటారో, వాతావరణం వాళ్లకి ఎలాంటి సమస్యలు ఇస్తుందో తెలుసు కొనే అవకాశం వచ్చింది.

Siachin3

జమ్మూ కాశ్మీర్ స్వయంప్రతిపత్తి కోసం ఆర్టికల్ 370ని రద్దు చేసిన కేంద్రం ఆ రాష్ట్రాన్ని రెండుగా విభజించి కేంద్రపాలిత ప్రాంతాలుగా ప్రకటించింది. ఇప్పుడు తాజాగా సియాచిన్ గ్లేసియర్ ప్రాంతాన్ని పర్యాటకుల సందర్శన కోసం తెరవడం వల్ల లఢక్ ప్రాంతం అభివృద్ధి పొందే అవకాశం ఉంది. పారిశ్రామికంగానే కాదు మౌలిక సదుపాయాల పరంగా కూడా పెద్దగా సౌకర్యాలు లేని జమ్ము-కాశ్మీర్‌కు పర్యాటక రంగమే ముఖ్యమైన ఆదాయ వనరులు. అందుకే ఈ రంగాన్ని అభివృద్ధి చేయడానికి కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. సియాచిన్ బేస్ క్యాంప్ నుంచి ఎత్తయిన కుమార్ పోస్ట్ వరకు వెళ్లే మార్గములో పర్యాటకులకు అనుమతి ఇచ్చారు. ఇంకెందుకు ఆలస్యం మీరూ రెడీ అయిపొండి.

Siachin 1

Next Story