ప్రభుత్వ నిర్లక్ష్యం.. తెలంగాణలో విజృంభిస్తోన్న కుష్టు వ్యాధి..!

By అంజి  Published on  15 Dec 2019 5:58 AM GMT
ప్రభుత్వ నిర్లక్ష్యం.. తెలంగాణలో విజృంభిస్తోన్న కుష్టు వ్యాధి..!

ముఖ్యాంశాలు

  • తెలంగాణలో పెరుగుతున్న కుష్టు వ్యాధుల కేసులు
  • జోగులాంబ గద్వాల జిల్లాలోనే 168 కుష్టు వ్యాధుల కేసులు
  • తాజా సర్వేలో 1,927 కొత్త కుష్టు వ్యాధి కేసులు నమోదు

తెలంగాణలో అంతరించకుపోయిందన్న కుష్టు వ్యాధి మళ్లీ విజృంభిస్తోంది. రాష్ట్రంలో కుష్టు వ్యాధుల కేసుల తీవ్రత గణనీయంగా పెరుగుతోంది. ఇటీవల చేపట్టిన ఇంటింటి సర్వేలో 1,927 మంది కుష్టు వ్యాధి ఉన్నట్లుగా అధికారులు గుర్తించారు. ఒక్క జోగులాంబ గద్వాల జిల్లాలోనే 168 కుష్టు వ్యాధుల కేసులు నమోదయ్యాయి. మహబూబాబాద్‌ జిల్లాలో 146, జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలో 110 కుష్టు వ్యాధుల కేసులు నమోదు కాగా మిగతా జిల్లాల్లో సగటున 35-40 కుష్టు కేసులు ఉన్నాయి.

కుష్టు వ్యాధుల సంఖ్య పెరుగుతుండటంతో తెలంగాణ ప్రజలు భయాందోలనకు గురవుతున్నారు. 2005 సంవత్సరం నాటికి దేశంలో కుష్టు వ్యాధుల సంఖ్య జీరోకి చేరింది. అప్పటి నుంచి మళ్లీ కుష్టు వ్యాధి నివారణ చర్యలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా నిర్లక్ష్యం వహించాయి. దీంతో ఇప్పుడు కుష్టు మహమ్మరి కేసులు పెరుగుతుండటంతో ప్రజల్లో ఆందోళన కలుగుతోంది. రాష్ట్రంలో 3,301 మందికి కుష్టు వ్యాధి సోకిందని.. అందులోకి చాలా మంది ఆ వ్యాధి నుంచి కోలుకున్నారని అధికారులు పేర్కొన్నారు.

ఇటీవల నిర్వహించిన సర్వేలో 1,927 కొత్త కేసులు నమోదవగా.. వాటిలో ప్యాసీ బ్యాసిలరీ, మల్టీ బ్యాసిలరీ కేసులను నిర్ధారించవలసి ఉంది. కృష్టు వ్యాధుల నివారణ చర్యలు చేపట్టేందుకు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ నడుం బిగించింది. యుద్ధప్రతిపాదిక చర్యలు చేపట్టి బాధితులకు చికిత్సను అందించాలని ఆదేశాలు జారీ చేసింది. సరైన నివారణ చర్యలు పాటించకపోవడం వల్లే కుష్టు వ్యాధి కేసులు పెరుగుతున్నాయని అధికారులు అంచనా వేశారు. లైప్రే అనే సూక్ష్మ బ్యాక్టీరియా ద్వారా ఈ వ్యాధి సంక్రమిస్తోంది. ఈ బ్యాక్టీరియా ఒక్కసారి శరీరంలోకి ప్రవేశించిన తర్వాత సుమారు ఐదు నుంచి ఏడేళ్ల తర్వాత వ్యాధి లక్షణాలు బయటపడుతాయి.

రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ త్వరగా నివారణ చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు. కొత్తగా నమోదైన కుష్టు వ్యాధుల కేసులను దగ్గరుండి పర్యవేక్షిస్తున్నామని రాష్ట్ర లెప్రసీ జాయింట్‌ డైరెక్టర్ జాన్‌బాబు అన్నారు. మల్టీ డ్రగ్‌ థెరపీ ద్వారా చికిత్స అందిస్తున్నామని, నెల వారీ మందులను కూడా ఉచితంగా ఇస్తున్నట్టు జాన్‌బాబు తెలిపారు. పాత కుష్టు కేసులన్నీ పూర్తిగా నయమయ్యాని పేర్కొన్నారు. దేశంలో కుష్టు రోగులు 3.05 శాతంగా ఉండగా.. రాష్ట్రంలో 1.14 శాతంగా ఉంది.

Next Story