చిరుతను పట్టేశారు..
By తోట వంశీ కుమార్ Published on 28 May 2020 2:02 PM ISTనల్లగొండ జిల్లా మర్రిగూడ మండలం రాజపేట తండా శివారులో చిరుతపులి సంచారం కలకలం రేపింది. ఉదయం నుంచి రైతులను, ప్రజలను తీవ్ర భయాందోళనకు గురి చేసిన చిరుతను ఎట్టకేలకు ఫారెస్టు సిబ్బంది పట్టుకున్నారు.
రాజంపేట తండా శివారులో ఓ రైతు తన పొలానికి రక్షణగా కంచెను వేశాడు. ఈ కంచెలో చిరుత పులి చిక్కుకుంది. ఉదయం చిరుతను గమనించిన రైతులు పోలీసులకు, అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. వెంటనే రంగంలోకి దిగిన అధికారులు .. చిరుతకు మత్తు మందు ఇచ్చేందుకు ప్రయత్నించారు. ఈక్రమంలో చిరుత ఒక్కసారిగా అధికారులపై దాడి చేసింది.
చిరుత దాడిలో ఇద్దరు ఫారెస్టు సిబ్బందికి గాయాలయ్యాయి. వారిని వెంటనే ఆస్పత్రికి తరలించారు. దాడి చేసిన అనంతరం చిరుత అక్కడున్న వాహనాల కిందకు వెళ్లింది. అనంతరం మరో ఉచ్చుతో ఆ వాహనాన్ని కవర్ చేసి చిరుతకు మత్తు మందు ఇచ్చారు. చిరుత సృహా కోల్పోయిన అనంతరం బోన్‌లోకి బంధించారు. అనంతరం దానిని హైదరాబాద్ లోని నెహ్రూ జూపార్క్‌కు తరలించారు. చిరుతను బంధించడంతో రాజపేట తండా వాసులు ఊపిరి పీల్చుకున్నారు.