ఏపీలో జగన్ పంతం నెగ్గించుకోనున్నాడా..?
By సుభాష్ Published on 26 Feb 2020 7:24 PM IST
ముఖ్యాంశాలు
శాసన మండలి రద్దును ఆమోదించే దిశగా కేంద్రం
జగన్‌కు సానుకూలంగా ఉన్న ఢిల్లీ పెద్దలు
వచ్చే బడ్జెట్ సమావేశాల్లో మండలి రద్దు బిల్లు
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రాష్ట్ర పాలన పగ్గాలు చేపట్టిన తర్వాత తన నిర్ణయాలతో దూసుకుపోతున్నారు. జగన్ 9 నెలల పాలనలో తీసుకున్న కీలకమైన అంశాల్లో శాసన మండలి రద్దు ఒకటి. గత నెలలో అసెంబ్లీ సమావేశాల్లో మండలిని రద్దు చేస్తూ సంచలన నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈ బిల్లు ఇప్పుడు హస్తినకు చేరింది. మండలి రద్దుపై కేంద్ర పెద్దలు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది సర్వత్రా ఆసక్తి నెలకొంది. ముఖ్యమంత్రి జగన్ ఈ మధ్య రెండు సార్లు ఢిల్లీకి వెళ్లి మోదీ, అమిత్ షా, ఇతర కేంద్ర మంత్రులతో భేటీ అయ్యారు. ఈ భేటీలో శాసనమండలి రద్దు, ఇతర కీలక అంశాలపై చర్చించారు. అయితే జగన్ ఢిల్లీ వెళ్లి వచ్చాక మండలి రద్దు విషయంలో సానుకూలంగా స్పందించారనే వార్తలు వచ్చాయి. శాసనమండలి రద్దు విషయంలో జగన్ అన్ని రకాలుగా చర్చించినట్లు, బిల్లు కూడా శరవేగంగా మంత్రి మండలిలో చర్చకు వచ్చే అవకాశాలున్నట్లు చెబుతున్నారు.
జగన్‌కు అనుకూలంగా కేంద్రం..
ఈ బిల్లు ముసాయిదాను కేంద్ర కేబినెట్ ఆమోదించడం అన్నది ఇప్పుడు లాంచనప్రాయమే. ఈ అంశంపై జగన్‌కు పూర్తిస్థాయిలో అనుకూలంగా చేయాలనేది మోదీ, అమిత్‌షాలు నిర్ణయించుకున్నారని వార్తలు వినవస్తున్నాయి. ఎలాంటి ఆటంకాలు లేకుండా కేంద్ర మంత్రి మండలిలోఈ బిల్లు చర్చకు వస్తుందని టాక్ వినిపిస్తోంది. కాగా, అక్కడ బిల్లును ఆమోదించిన తర్వాత ఉభయ సభల్లో ప్రవేశపెట్టడమే కేంద్రానికి ఉన్న బాధ్యత. శాసన మండలిని రద్దు చేసిన జగన్‌కు కేంద్ర సర్కార్ అనుకూలంగానే ఉందని తెలుస్తోంది.
మండలి రద్దును ఆమోదిస్తే కేంద్రానికి లాభమా..?
ఏపీ శాసన మండలి రద్దు వల్ల కేంద్రానికి ఒక్కపైసా కూడా ఖర్చు ఉండదు. పెద్దగా నిధులివ్వాల్సిన అవసరం కూడా ఉండదు. మండలి రద్దు అంశాన్ని తీర్చితే జగన్ కోరిక తీర్చామని చెప్పుకునేందుకు వీలవుతుంది. ఈ నేపథ్యంలో జగన్‌ను తమవైపు తిప్పుకుంటే రేపటి రోజుల్లో బీజేపీకి ఉపయోగం ఉంటుందని, రాజ్యసభలో ఆయనకు ఉన్న అరడజను ఎంపీల మద్దతు సునాయాసంగా పొందే అవకాశం ఉంటుందని కమలం పెద్దలు భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో మండలి రద్దు బిల్లును శరవేగంగా ఆమోదించేందుకు కేంద్రం సిద్ధమవుతోందని రాజకీయ విశ్లేషకులు చర్చించుకుంటున్నారు.
మార్చిలో జరిగే సమావేశాల్లో మండలి రద్దు అవుతుందా..?
మండలిని రద్దు చేస్తూ జగన్ సర్కార్ తీసుకున్న నిర్ణయం ఇప్పుడు కేంద్రంపై ఆధారపడి ఉంది. జగన్‌పై సానుకూల వ్యక్తం చేస్తున్న కేంద్ర సర్కార్‌ను చూస్తుంటే.. మార్చిలో జరిగే బడ్జెట్ సమావేశాల్లో మండలి రద్దు జరుగుతుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. వచ్చే బడ్జెట్‌లో మండలి రద్దుకు ఆమోదం తెలిపితే జగన్ పని సక్సెస్ అయినట్లే. మండలి రద్దు అయితే కనుక ఏపీలో జగనే మొనగాడు అయిపోతారు. మరోసారి మండలి ముఖం చూడనని గట్టిగా భావిస్తున్న జగన్.. తన పంతం నెగ్గించుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఏది ఏమైనా జగన్‌ను తమ వైపు తిప్పుకోవాలనే ఉద్దేశంతో కేంద్రం కూడా మండలి రద్దు అంశంపై బిజీగా ఉన్నట్లు ఢిల్లీ పెద్దల నుంచి సమాచారం.