ఏడవ నిజాం చివరి సంతానం.. బషీరున్నీసా కన్నుమూత..
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 29 July 2020 7:17 AM GMT
ఏడవ నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ 34 మంది సంతానంలో జీవించివున్న ఏకైక కుమార్తెగా ఉన్న సాహెబ్ జాదీ బషీరున్నీసా బేగం కన్నుమూశారు. ఆమె వయసు 93 సంవత్సరాలు. చార్మినార్ సమీపంలోని పురానీ హవేలీ, నిజాం మ్యూజియం ఆవరణలో ఉన్న ఉస్మాన్ కాటేజ్ భవనంలో ఆమె మరణించినట్టు బంధువులు తెలిపారు.
1906లో అజామ్ ఉన్నీసా బేగంతో మీర్ ఉస్మాన్ కు వివాహం కాగా, 1927లో బషీరున్నీసా బేగం జన్మించారు. ఆమె వయస్సు 93 సంవత్సరాలు.. గత కొంత కాలంగా అనారోగ్యం కారణంగా బాధపడుతున్న ఆమె మంగళవారం తెల్లవారు జామున తుది శ్వాస విడిచారు. బషీరున్నిసాకు అలీ పాషాగా పేరొందిన నవాబ్ కాసిం యార్ జంగ్‌తో వివాహమయ్యింది. అలీ పాషా 1998లో మరణించారు. బషీరున్నీసా బేగం భౌతిక కాయాన్ని పురానీ హవేలీకి సమీపంలోనే ఉన్న మసీదుకు తరలించిన మత పెద్దలు, బంధువులు జనాజా నమాజ్ నిర్వహించారు. నిజాం మనవడు నవాబ్ జాఫ్ అలీఖాన్ నేతృత్వంలో ఆమెకు అంత్యక్రియలు జరిగాయి.
మీర్ ఉస్మాన్ కు 34 మంది సంతానం కాగా, ఇప్పటి వరకూ జీవించి ఉన్నది బషీరున్నీసా మాత్రమే. ఆమె కన్నుమూయడంతో మీర్ ఉస్మాన్ తదుపరి తరం అంతరించినట్లయింది. ఆమెకు కుమారుడు, కుమార్తె ఉండగా, కుమారుడు దాదాపు 25 సంవత్సరాల క్రితం తప్పిపోయాడు. ఇంతవరకూ అతని ఆచూకీ లభించకలేదు.