భారత్‌లో కరోనా విజృంభణ.. 24గంటల్లో 62,064 కేసులు
By తోట వంశీ కుమార్ Published on 10 Aug 2020 5:44 AM GMTభారత్‌లో కరోనా వైరస్ విజృంభిస్తోంది. నిత్యం రికార్డు సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 62,064 పాజిటివ్ కేసులు నమోదు కాగా.. 1,007 మంది ప్రాణాలు కోల్పోయినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. వీటితో కలిపి దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 22,15,074కి చేరింది. మొత్తం నమోదు అయిన కేసుల్లో 15,37,744 మంది కోలుకోని ఆస్పత్రి నుంచి డిశ్చార్జి కాగా.. 6,34,945 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఇక ఈ మహమ్మారి బారిన పడి ఇప్పటి వరకు 44,386 మంది ప్రాణాలు పోగొట్టుకున్నారు. ఇక దేశంలో రికవరి రేటు 69 శాతం ఉండగా.. మరణాల రేటు 2 శాతంగా ఉంది.
ఇంతవరకూ 2.41 కోట్లకు పైగా శాంపిల్స్ కలెక్ట్ చేసి పరీక్షించినట్టు ఐసీఎంఆర్ (ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్) గణాంకాలు వెల్లడించాయి.ఇండియాలో నిమిషానికి 500కు పైగా కరోనా పరీక్షలను చేస్తున్నాము. రోజుకు 5 లక్షలకు పైగా టెస్టులను చేసే సామర్థ్యం మనకుంది" అని ఐసీఎంఆర్ మెడికల్ కోఆర్డినేటర్ లోకేశ్ శర్మ వెల్లడించారు. ఇక ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక పాజిటివ్ కేసులు నమోదు అవుతున్న దేశాల్లో భారత్ మూడో స్థానంలో ఉండగా.. అత్యధిక మరణాలు నమోదు అవుతున్న దేశాల్లో ఐదో స్థానంలో కొనసాగుతోంది.