ఆ రెండేళ్లు ఏమీ చేయకుండా ఇంట్లోనే కూర్చొన్నా..
By తోట వంశీ కుమార్ Published on 29 March 2020 7:33 AM GMTటీమ్ఇండియా మాజీ పేసర్, చెన్నై సూపర్ కింగ్స్ బౌలింగ్ కోచ్ లక్ష్మీపతి బాలాజీ కరోనా వైరస్ పై పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. మనం మనుగడ సాగించడానికే పోరాడతామన్నాడు. వెన్నునొప్పి గాయం కారణంగా కెరీర్‌ను అర్థాంతరంగా ముగించిన బాలాజీ 2004-05 పాకిస్థాన్ పర్యటనలో రాణించి గుర్తింపును తెచ్చుకున్నాడు.
ప్రస్తుత పరిస్థితులపై ఈ చెన్నై బౌలింగ్ కోచ్ మాట్లాడాడు. గుర్తు తెలియని వ్యాధులతో మన పూర్వీకులు పోరాడేవారని, అలాగే మన తల్లిదండ్రులు కూడా క్లిష్ట సందర్భాలను ఎదుర్కొన్నాని గుర్తు చేశాడు. క్లిష్ట పరిస్థితుల్లో వాస్తవాన్ని అంగీకరించాలని, అలాగే సమయాన్ని గౌరవించాలని, ఈ రోజు ఎలా గడపాలో అని ఆలోచిస్తే అది చాలా కష్టంగా ఉంటుందని తెలిపాడు. ఇలాంటి కష్టకాలంలో వాస్తవాన్ని అర్థం చేసుకుని స్వీయ క్రమశిక్షణ అవలంభించాలని సూచించాడు.
ప్రభుత్వం చెప్పేది విని బాధ్యతగా ఆచరించాలన్నాడు. తనను వెన్ను నొప్పి తీవ్రంగా బాధించేదని చెప్పాడు. అప్పుడు వెన్నునొప్పి సర్జరీ చేయించుకున్నానని.. ఆసమయంలో.. దాదాపు రెండేళ్ల పాటు క్రికెట్ ఆడలేకపోయాయని, ఏమీ చేయకుండా ఇంట్లోనే కూర్చోనేవాడినని గుర్తు చేసుకున్నాడు. ప్రస్తుతం ఈ విరామాన్ని తన కుటుంబ సభ్యులతో హాయిగా గడుపుతున్నట్లు చెప్పాడు.