పోలీసులపై వలస కార్మికుల దాడి.. వాహనాల ధ్వంసం
By సుభాష్ Published on 29 April 2020 12:39 PM GMTవలస కార్మికులు ఆగ్రహంతో రగిలిపోయారు. లాక్‌డౌన్ కారణంగా నెల రోజులుగా పని లేక, తినేందుకు తిండి లేకపోవడంతో ఆగ్రహానికి గురయ్యారు. పోలీసులపై రాళ్లు రువ్వుతూ కర్రలతో దాడికి దిగారు. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా కంది సమీపంలోని ఐఐటీ, హైదరాబాద్ భవనం వద్ద చోటు చేసుకుంది. తమకు పనులు కల్పించాలని డిమాండ్ చేస్తూ ఆందోళనకు దిగారు. నాలుగైదు రోజుల నుంచి తినేందుకు తిండి కూడా లేదని కార్మికులు నిరసన వ్యక్తం చేశారు.
దీంతో రంగంలోకి దిగిన పోలీసులు వారిని సముదాయించేందుకు ప్రయత్నించారు. అవేమి వినిపించుకోకుండా పోలీసులపై దాడికి దిగారు. రాళ్లు రువ్వుతూ పోలీసుల వాహనాలను ధ్వంసం చేశారు.
కందిలో ఐఐటీ హైదరాబాద్ భవనాల నిర్మాణ పనుల కోసం ఇతర రాష్ట్రాల నుంచి సుమారు 1600 మంది కార్మికులు వచ్చారు. అయితే లాక్‌డౌన్ కారణంగా గత నెల రోజులు నుంచి వారంతా చిక్కుకుపోయారు. యజమాని కార్మికులను కంది ఐఐటీ దగ్గరే ఉంచారు. లాక్‌డౌన్ కారణంగా ఎలాంటి ఉపాధి లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులకు గురై బుధవారం ఉదయం కార్మికులంతా సొంతూళ్లకు వెళ్లేందుకు రెడీ అయ్యారు. తమను సొంత గ్రామాలకు పంపాలని ఆందోళనకు దిగారు.
ఘటన ప్రాంతానికి పోలీసు బలగాలు చేరుకోవడంతో కార్మికులు వెనక్కి తగ్గారు. సోషల్ డిస్టెన్స్ పాటించాలని పోలీసులు ఎన్నిసార్లు చెప్పినా వందలాది కూలీలు ఒకే చోటు చేరారు. ఈ ఆందోళనలు పలువురు పోలీసులకు గాయాలయ్యాయి. దీంతో ఐఐటీ హైదరాబాద్ గేటు ముందు భారీ ఎత్తున పోలీసు బలగాలు చేరుకున్నాయి. సంగారెడ్డి జిల్లా ఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి ఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు.