బీజేపీలో చేరిన నటి కుష్బూ
By సుభాష్ Published on 12 Oct 2020 9:21 AM GMTప్రముఖ సినీ నటి కుష్బూ బీజేపీలో చేరారు. కాంగ్రెస్ సభ్యత్వానికి రాజీనామా చేసిన కొద్ది గంటల్లోనే ఖుష్బూ బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. సోమవారం బీజేపీ సీనియర్ నేతల సమక్షంలో ఆమె పార్టీలో చేరారు. వచ్చే ఏడాది తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో.. ఆమె పార్టీకి బలం చేకూరుస్తారని కమలనాథులు భావిస్తున్నారు. క్షేత్రస్థాయిలో ప్రజలతో సంబంధం లేని పార్టీ నేతల వైఖరి కారణంగానే కాంగ్రెస్‌కు రాజీనామా చేస్తున్నట్లు పార్టీ అధినేత్రి సోనియాకు ఖుష్బూ లేఖ రాసిన విషయం తెలిసిందే. అయితే బీజేపీలో ఆమెకు కీలక పదవి కట్టబెట్టనున్నట్లు తెలుస్తోంది.
కుష్బూ 2014 నుంచి ఆరు సంవత్సరాలుగా కాంగ్రెస్‌లోనే ఉన్నారు. నిన్నటి వరకు ఆమె కాంగ్రెస్ పార్టీ జాతీయ అధికార ప్రతినిధిగా కొనసాగారు. అయితే 2014 నుంచి కాంగ్రెస్ అధికారంలోకి రాకపోవడంతో ఆమె రాజకీయ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది.
ఈ క్రమంలో2019 లోక్‌సభ ఎన్నికల్లో ఎంపీ టికెట్ ఇవ్వాలని పట్టుబట్టారు. కానీ డీఎంకే -కాంగ్రెస్ పొత్తు నేపథ్యంలో సీట్లు సర్దుబాటు కారణంగా ఆమెకు ఎంపీ టికెట్ దక్కలేదు. ఆ తర్వాత రాజ్యసభకు పంపుతామని ఎన్నోసార్లు చెప్పినప్పటికీ ఆవేవీ కార్యరూపం దాల్చలేదు. అభిమాన బలం ఎక్కువగా ఉన్నా.. ఆమె పార్టీలో ఉండలేని పరిస్థితి నెలకొంది. కాంగ్రెస్‌లో రాహుల్ గాంధీ సపోర్టు ఉన్నా… త అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో టికెట్ దక్కలేక పోటీ చేయలేకపోయారు. కాంగ్రెస్, డీఎంకే కూటమిగా కొనసాగడం, గతంలో డీఎంకేతో విభేదించి కాంగ్రెస్‌లో చేరడం వల్లనే డీఎంకే ముఖ్యనేత ఒకరు కుష్బూకు అడ్డుతగులుతున్నట్లు తెలుస్తోంది. ఇక తీవ్ర మనస్థాపానికి గురైన ఆమె.. పార్టీ మారాలని నిర్ణయించుకుంది.
ఇక ఇటీవల కేంద్రం ప్రవేశపెట్టిన నూతన విద్యావిధానంపై సైతం కుష్బూ ప్రశంసలు కురిపించారు. అయితే రానున్న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో సత్తాచాటాలని ఎత్తుగడలు వేస్తున్న కమలం పార్టీ, సినీ నటులను పార్టీలో చేర్చుకోవాలని ముందు నుంచే భావిస్తోంది.