కుల్‌భూషణ్ జాదవ్ కేసులో మరో ముందడుగు.. లాయర్‌ను నియమించుకునేందుకు భారత్‌కు అవకాశం
By సుభాష్ Published on 3 Aug 2020 2:06 PM GMTగూఢచర్యం కేసులో పాక్ చెరలో ఉన్న భారత నౌకదళ మాజీ అధికారి కుల్‌భూషణ్ జాదవ్ కేసులో మరో ముందడుగు పడింది. మరణ శిక్ష పునఃసమీక్ష అంశంలో ఆయన తరపున వాదించేందుకు లాయర్‌ను నియమించుకునే అవకాశాన్ని భారత్‌కు ఇస్లామాబాద్ హైకోర్టు కల్పించింది. అతడు పాకిస్థానీ న్యాయవాదే అయి ఉండాలని షరతు విధించింది. తదుపరి విచారణ సెప్టెంబర్ 3కు వాయిదా వేసింది.
అంతర్జాతీయ కోర్టు ఆదేశాల మేరకు మిలటరీ కోర్టు ఇచ్చిన తీర్పును సివిల్ కోర్టులో సమీక్షించే అవకాశాన్ని తీసుకొస్తూ ఇటీవల పాక్ సర్కార్ ఆర్డినెన్స్ జారీ చేసింది. అయితే జాదవ్ తరపున వాదనలు వినిపించేందుకు లయర్‌ను నియమించాలని జూలై 22న ఇస్లామాబాద్ హైకోర్టును ఆశ్రయించింది. విచారణ సందర్బంగా న్యాయవాది నియమించుకునేందుకు భారత్‌కు అవకాశాన్ని కల్పించినట్లు పాక్ అటార్నీ జనరల్ ఖలీద్ జావేద్ తెలిపారు.
కాగా, గూఢచర్యం ఆరోపణలపై 2017 ఏప్రిల్‌లో పాక్ మిలటరీ కోర్టు కుల్ భూషణ్‌కు మరణ శిక్ష విధించిన విషయం తెలిసిందే. దీంతో భారత్ ఐసీజేను ఆశ్రయించింది. దీనిపై విచారణ చేపట్టిన కోర్టు.. 2017 మే 18న కుల్‌భూషణ్ జాదవ్ మరణశిక్షపై స్టే విధించింది. అనంతరం ఇరుదేశాల వాదనలు విన్న న్యాయస్థానం కేసును పునః సమీక్షించి సరైన సాక్ష్యాధారాలు సమర్పించే వరకు ఉరిశిక్షను నిలుపుదల చేస్తూ 2019 జూలై 17న తీర్పు వెల్లడించింది. ఆ తీర్పును అనుసరించి సివిల్ కోర్టులో పునః సమీక్షకు అనుగుణంగా పాక్ ప్రభుత్వం ఇటీవల ఆర్డినెన్స్ తీసుకువచ్చింది. దీనిపై అధికార పార్టీపై విపక్షాలు మండిపడ్డాయి. జాదవ్‌కు ఊరట కల్పించేందుకు ఈ నిర్ణయం తీసుకుందని విమర్శించగా, ఐసీజే తీర్పును అనుసరించే తీసుకువచ్చామని ప్రభుత్వం పేర్కొంది.