నాన్నకు ప్రేమతో..
By అంజి Published on 25 Jan 2020 3:21 PM GMTమరో ఎన్నిక ముగిసింది. ప్రతిపక్ష పార్టీల ఆశలను దెబ్బతీస్తూ.. పాలక టిఆర్ఎస్ పార్టీ తెలంగాణలో 120 మున్సిపాలిటీలు, 9 మునిసిపల్ కార్పొరేషన్లకు జరిగిన ఎన్నికలలో.. జిల్లా పరిషత్ ఎన్నికల రికార్డును తిరగరాస్తూ.. మరోమారు అధికార టీఆర్ఎస్ తన విజయ మాయాజాలాన్ని పునరావృతం చేసింది. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా కేటీఆర్.. మొదటి ఎన్నికనే విజయవంతంగా ముగించడంతో తనపై తన తండ్రి, పార్టీ అధినేత కేసీఆర్ పెట్టుకున్న అంచనాలను అందుకొని తండ్రికి తగ్గ తనయుడిగా నిరూపించుకున్నారని పార్టీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నారు. కేటీఆర్ ఫ్యూచర్ సీఎం అంటూ నినాదాలతో హోరెత్తిస్తున్నారు. అధికార పార్టీ పట్ల ఉన్న వ్యతిరేకతను క్యాష్ చేసుకుందామనుకున్న బీజేపీ, కాంగ్రెస్‌లకు యువనేత కేటీఆర్ వ్యూహాలతో భంగపాటు తప్పలేదు.
ఇక.. ఇప్పటి వరకూ ప్రకటించిన ఎన్నికల ఫలితాల ప్రకారం.. టీఆర్ఎస్ 103 మునిసిపాలిటీలు, ఎనిమిది కార్పొరేషన్లను కైవసం చేసుకుంది. టీఆర్ఎస్ 90 శాతం మునిసిపాలిటీలను కైవసం చేసుకుని సత్తా చాటగా.. కొన్ని చోట్ల స్వతంత్ర, తిరుగుబాటు అభ్యర్థులు తమ బలాన్ని చూపించారు. ముఖ్యంగా కేటీఆర్ సొంత నియోజకవర్గం సిరిసిల్లలో గులాబీ పార్టీకి వ్యతిరేక పవనాలు వీయగా.. పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇలాఖా కోదాడ, హుజుర్ నగర్ మునిసిపాలిటీలను పింక్ పార్టీ దక్కించుకుంది. ఇక, సంగారెడ్డి మునిసిపాలిటీలో కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గా రెడ్డికి టిఆర్ఎస్ జలక్ ఇచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన భైంసా మునిసిపాలిటీని ఎంఐఎం గెలుచుకుంది. గట్టి పోటీ ఇచ్చిన బిఎన్‌పి కేవలం ఒక సీటుతో భైంసా మునిసిపాలిటీని కోల్పోయింది.
లక్సెట్టిపేట మున్సిపాలిటీలోని 3వ వార్డులో టీఆర్‌ఎస్, కాంగ్రెస్ అభ్యర్థులు సమానంగా ఓట్లు సాధించగా.. ప్రతి పక్ష కాంగ్రెస్ అభ్యర్థికి లక్కీ డ్రాలో విజయం వరించింది. సిరిసిల్ల మున్సిపాలిటీలోని 39 వార్డుల్లో టీఆర్‌ఎస్ 24, బీజేపీ 3, కాంగ్రెస్ 2 వార్డుల్లో విజయం సాధించగా, స్వతంత్రులు 10 మంది విజయం సాధించారు. టీఆర్‌ఎస్ అన్ని వార్డులలో విజయం సాధిస్తుందని ధీమాతో ఉన్న అందరి అంచనాలను పటా పంచలు చేస్తూ 10 మంది స్వతంత్రులు నెగ్గి.. కేటీఆర్ ఇలాఖాలో వ్యతిరేకతను చూపించారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. గెలిచిన స్వతంత్రులు అందరూ టీఆర్‌ఎస్ రెబెల్సే కావడం విశేషం. వీరు ఏ నిమిషమైనా టీఆర్‌ఎస్ పార్టీలో చేరొచ్చని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.
ప్రజలు కేసీఆర్ వైపే.. కేటీఆర్
మున్సిపల్ ఎన్నికల్లో విజయం పట్ల టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. ఇంతటి ఘన విజయాన్ని ఇచ్చిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌పై ప్రజలకు పూర్తి నమ్మకం ఉందని మరోమారు నిరూపితమైందని అన్నారు. ప్రభుత్వం తెలంగాణ ప్రజల అభివృద్ధి, సంక్షేమానికి అంకిత భావంతో పని చేస్తోందని.. రానున్న కాలంలో ప్రతిపక్ష పార్టీలు బాధ్యతాయుతమైన పాత్ర పోషిస్తాయని నమ్ముతున్నాని అన్నారు. ఇక వచ్చే జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో కూడా 150 డివిజన్లలో 130 డివిజన్లను అధికార టీఆర్‌ఎస్ గెలుచుకుంటుందని పూర్తి నమ్మకంతో ఉన్నామన్నారు. అయితే గత 2016 జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ 99 డివిజన్లను గెల్చుకుంది.
ఫలితాలు ముందుగానే ఉహించాం.. ఎర్రబెల్లి
అలాగే.. ఈ ఫలితాలపై పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ.. ఫలితాలు ముందుగా ఉహించిన విధంగానే వెలువడ్డాయన్నారు. తెలంగాణ ప్రజలు సీఎం కేసీఆర్‌తోనే ఉన్నారని ఆయన అన్నారు. నా 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఇంత పెద్ద విజయాన్ని తాను ఎప్పుడూ చూడలేదని మంత్రి దయాకర్ అన్నారు. సీఎం కేసీఆర్ ఆరేళ్ల పాలన తర్వాత కూడా ప్రతిపక్ష కాంగ్రెస్, బీజేపీలకు ఆశించినన్ని సీట్లు రాకపోగా.. భారీ మెజార్టీతో టీఆర్‌ఎస్‌కు ప్రజలు బ్రహ్మరథం పట్టారని ఆయన పేర్కొన్నారు.