నాకు ఆ పదవే ఇష్టం..!
By అంజి Published on 1 Jan 2020 3:27 PM ISTహైదరాబాద్: తాను కాబోయే సీఎం అన్నది వాస్తవం కాదని రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. అసెంబ్లీ సాక్షిగా తానే సీఎంగా కొనసాగుతానని కేసీఆర్ క్లారిటీ ఇచ్చారని.. అయినా కేటీఆర్ సీఎం అని మళ్లీ ప్రచారం చేయడం భావ్యం కాదని పేర్కొన్నారు. ఫిబ్రవరి తర్వాత టీఆర్‌ఎస్ శ్రేణులకు శిక్షణా తరగతులు ఏర్పాటు చేస్తామని కేటీఆర్ అన్నారు. సోషల్ మీడియా టీమ్‌ను కూడా పటిష్టం చేస్తామన్నారు. మున్సిపల్ ఎన్నికలపై రెండు రోజుల్లో కేసీఆర్‌కు నివేదిక అందిస్తామని మంత్రి కేటీఆర్ తెలిపారు. తర్వాత సీఎంతో మున్సిపల్ ఎన్నికలపై సమీక్ష ఉంటుందన్నారు. కొత్త మున్సిపల్ చట్టాన్ని పటిష్టంగా అమలు చేయడమే లక్ష్యమని, చట్టానికి లోబడి పనిచేయకుంటే కౌన్సిలర్లను తొలగిస్తామన్నారు. కాంగ్రెస్ పార్టీకి 100 సంవత్సరాలు చరిత్ర ఉందన్న కేటీఆర్.. కాంగ్రెస్‌ను ఆషామాషీగా తీసేయొద్దని వ్యాఖ్యనించారు. తమకు ప్రధానంగా కాంగ్రెస్‌తోనే పోటీ అని తెలిపారు. మున్సిపల్ ఎన్నికల్లో మంచి ఫలితాలు సాధిస్తామని, 2020లో టీఆర్‌ఎస్ శుభారంభం చేస్తుందని మంత్రి కేటీఆర్ ఆశాభావం వ్యక్తం చేశారు.
తాను వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఈ ఏడాదిలో టీఆర్‌ఎస్ పార్టీ అనేక లక్ష్యాలు సాధించిందన్నారు. 2018, 2019 సంవత్సరాలు ఎంతో ఆనందాన్ని ఇచ్చాయని మంత్రి కేటీఆర్ అన్నారు. ఆదర్శ రాష్ట్రంగా, అగ్రశ్రేణి రాష్ట్రంగా తెలుగుతోందని మంత్రి కేటీఆర్ చెప్పారు. మున్సిపల్ ఎన్నికల్లో గెలిచిన ప్రజా ప్రతినిధులకు పార్టీలకు అతీతంగా శిక్షణ తరగతులు నిర్వహిస్తామన్నారు. మున్సిపల్ చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయడం.. మున్సిపల్ మంత్రిగా తన ముందున్న ప్రధాన లక్ష్యమని కేటీఆర్ పేర్కొన్నారు. 60 లక్షల రికార్డు సభ్యత్వం.. కమిటీల ఏర్పాటు, జిల్లా పార్టీ కార్యాలయాల నిర్మాణాలు దాదాపు పూర్తి అయ్యాయని మంత్రి కేటీఆర్ తెలిపారు. సంక్రాంతి తర్వాత సీఎం కేసీఆర్ జిల్లా పార్టీ కార్యాలయాలను ప్రారంభిస్తారన్నారు. రాజకీయాలకు అతీతంగా కేంద్రం అన్ని రాష్ట్రాలను సమానంగా చూడాలి మంత్రి కేటీఆర్ అన్నారు. తమకు బీజేపీ, కాంగ్రెస్ శాశ్వత శుత్రువులు కాదన్నారు.