ఇకపై రెండు పంటలకు సమృద్ధిగా నీరు : సీఎం కేసీఆర్

By రాణి  Published on  30 Dec 2019 12:37 PM GMT
ఇకపై రెండు పంటలకు సమృద్ధిగా నీరు : సీఎం కేసీఆర్

కరీంనగర్ ఉమ్మడి జిల్లా అయిన రాజన్న సిరిసిల్ల జిల్లాలో సీఎం కేసీఆర్ దంపతులు గోదావరికి జలహారతినిచ్చి, పసుపు, కుంకుమలతో పూజలు నిర్వహించారు. అనంతరం శ్రీ రాజరాజేశ్వర జలశయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సీఎం కేసీఆర్ మాట్లాడుతూ..కాళేశ్వరం జలాలతో కోదాడ వరకూ చెరువులు నింపుకున్నామన్నారు. కరీంనగర్ ప్రజలు చాలా గొప్పవారని, 2001 నుంచి తమ ఆత్మగౌరవ బావుటాను ఎగురవేయడంలో ముందున్నారని సీఎం కొనియాడారు. ఎస్సారెస్పీతో సంబంధం లేకుండా 50-60 టీఎంసీల జలాన్ని కాళేశ్వరం నుంచి ఎత్తిపోసి, రైతులకు నీటి ఎద్దటి లేకుండా చేశామన్నారు. మిడ్ మానేరు దిగువన ఉన్న ఆయకట్టు ద్వారా రెండు పంటలకు నీళ్లు అందుతాయని కేసీఆర్ తెలిపారు. ఇకపై కాళేశ్వరం నుంచి వచ్చే నీటితో రైతన్నలు మొగులుకు మొఖం చూడకుండా రెండు పంటలు వేసుకోవచ్చన్నారు.

గోదావరి గలగల పారే జిల్లాల్లో కరువు ఎక్కువగా ఉండటం బాధాకరమన్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 46 వాగులున్నప్పటికీ భయంకరమైన కరువు ఉండేదని, అప్పట్లో గోడల మీద చావులు ఏ సమస్యకి పరిష్కారం కాదని రాస్తుండేవారని గుర్తుచేశారు కేసీఆర్. తెలంగాణ రాష్ర్టం వచ్చాక రాష్ట్రాన్ని సస్యశ్యామలంగా తీర్చిదిద్దుతామని చెప్పిన మాటలను నిలబెట్టుకున్నామన్నారు. భూగర్భ జలాల మట్టం గణనీయంగా పెరిగిందని, 140 కిలోమీటర్ల మేర గోదావరి జలాలు ఏడాది పొడవునా సజీవంగా ఉంటుందన్నారు. కరీంనగర్ జిల్లాలో మానేరు 181 కిలోమీటర్లు పారుతోందని, తద్వారా జిల్లాలోని చెరువులన్నీ నిండుతున్నాయని పేర్కొన్నారు సీఎం కేసీఆర్. కరీంనగర్ జిల్లాలో చెక్ డ్యామ్ ల నిర్మాణానికి రూ.1258 కోట్లు కేటాయించామన్నారు. అలాగే జిల్లాలోని అన్ని చెక్ డామ్ లలో జూన్ లోపు నీరు నిండాలని అధికారులను ఆదేశించారు.

మానేరు రివర్‌పై 29 చెక్‌డ్యాంలు, మూలవాగుపై 10 చెక్‌డ్యాంలు నిర్మించేందుకు టెండర్లు పిలవాలని ఆదేశాలు జారీ చేశారు. ఎక్కడా ఏ నమ్మకం లేని రోజే జెండా ఎగురవేశాం కాబట్టే మాకు కమిట్ మెంట్ ఎక్కువ అని, కమిట్ మెంట్ తోనే ఇచ్చిన మాట, చేసిన వాగ్ధానాన్ని నిలబెట్టుకుంటామన్నారు.

Next Story