కేంద్రం కృష్ణా బోర్డును రద్దు చేయనుందా.?

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  13 Jun 2020 8:15 AM GMT
కేంద్రం కృష్ణా బోర్డును రద్దు చేయనుందా.?

వినూత్న నిర్ణయాలతో కేంద్రం తన పట్టును పెంచుకునే ప్రయత్నం చేస్తోందా? రాష్ట్రాలకున్న అధికారాలకు కోత పెడుతూ.. తానో సూపర్ పవర్ లా మారే దిశగా కేంద్రాన్ని మరింత బలోపేతం చేసేలా మోడీ సర్కారు ప్రయత్నిస్తుందా? అన్నదిప్పుడు చర్చగా మారింది. ఇటీవల కాలంలో తీసుకున్న మోడీ సర్కారు నిర్ణయాలు చూస్తే.. రాష్ట్రాలకు పరిమితులు.. పరిధుల్ని పెంచేయటం.. ప్రతి విషయంలోనూ కేంద్రానికి కర్రపెత్తనం ఉండేలా పావులు కదుపుతున్నట్లు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ఇప్పటికే వన్ నేషన్.. వన్ రేషన్ పేరుతో కీలకమైన పౌరసరఫరాల వ్యవస్థపై పట్టు పెంచుకుంటున్న కేంద్రం.. విద్యుత్తు రంగంలో జోక్యం చేసుకునేందుకు వీలుగా పంపిణీ వ్యవస్థలో మార్పులు చేస్తూ కొత్త ఆర్డినెన్సును తీసుకొచ్చారు. ఇప్పటికే రాష్ట్రాలకు ఇచ్చే రుణ సదుపాయంపై నిబంధనల పేరుతో ముకుతాడు వేస్తున్న కేంద్రం.. ఇప్పుడు నీటి వనరులపై ఫోకస్ చేసినట్లుగా చెబుతున్నారు. ఇందులో భాగంగా తొలి షాక్ రెండు తెలుగు రాష్ట్రాలకు మోడీ సర్కారు ఇవ్వనున్నట్లు చెబుతున్నారు.

కీలకమైన కృష్ణా బోర్డును రద్దు చేసి.. దాని స్థానంలో ప్రత్యేక అథారిటీని ఏర్పాటు చేసేలా నిర్ణయం తీసుకోనున్నట్లుగా మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఎందుకిలా? అన్న ప్రశ్నకు సమాధానం చప్పున చెప్పేస్తున్నారు. ఇప్పుడున్న కృష్ణా బోర్డుకు ఎలాంటి అధికారాలు లేకపోవటం.. బోర్డుల సూచనలు చేయటం తప్ప ఇచ్చిన ఆదేశాల్ని అమలు చేయని రాష్ట్రాలపై చర్యలు తీసుకునే అధికారం లేదు. ఇదంతా ఒక ఎత్తు అయితే కృష్ణా బేసిన్ లోని కొన్ని రాష్ట్రాలకు ఈ బోర్డుతో ఎలాంటి సంబంధం లేకపోవటం కూడా కారణం. దీంతో.. కేంద్రం రంగంలోకి దిగి.. ఒక కొత్త అథారిటీని ఏర్పాటు చేయాలన్న ఆలోచనలో ఉన్నట్లు చెబుతున్నారు.

అలా చేయటం ద్వారా.. కృష్ణా బేసిన్ లోని నీళ్లను ఏ రాష్ట్రం ఎంత వాడుకోవాలి? వినియోగించిన తీరు.. నిబంధనల్ని ఉల్లంఘించిన వారిపై చర్యలు.. కోటాలు.. కొత్త ప్రాజెక్టులు.. ఇలా చెప్పుకుంటూ పోతే పలు అంశాలపై పట్టు ఉండేలా కొత్త అథారిటీని ఏర్పాటు చేసే వీలుందని చెబుతున్నారు. కృష్ణానీటి వినియోగం విషయంలోనూ.. కొత్త ప్రాజెక్టుల విషయంలో చోటు చేసుకుంటున్న వివాదాల్ని పరిష్కరించుకునే విషయంలో రాష్ట్ర ప్రభుత్వాలు విఫలం కావటం కూడా కేంద్రం వెలెట్టటానికి అవకాశాన్ని ఇస్తుందని చెప్పక తప్పదు. ఒకవేళ.. ఇప్పుడు వినిపిస్తున్న ఈ అంశం అధికారిక నిర్ణయంగా మారితే.. రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాల స్పందన ఎలా ఉంటుందన్నది మరో ప్రశ్నగా మారింది.

Next Story
Share it