ఇంగ్లాండ్‌పై విండీస్ విజయం.. కోహ్లీ ఎలా స్పందించాడంటే..?

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  13 July 2020 9:32 AM GMT
ఇంగ్లాండ్‌పై విండీస్ విజయం.. కోహ్లీ ఎలా స్పందించాడంటే..?

ఎన్నో రోజుల తర్వాత ఇంటర్నేషనల్ క్రికెట్ మొదలైన సంగతి తెలిసిందే..! ఇంగ్లాండ్-వెస్టిండీస్ జట్లు సౌతాంఫ్టన్ వేదికగా తలపడ్డాయి. ఈ మ్యాచ్ లో విండీస్ నాలుగు వికెట్ల తేడాతో విజయాన్ని సాధించింది. షానోన్ గేబ్రియెల్ బౌలింగ్, జెర్మైన్ బ్లాక్ వుడ్ 95 పరుగుల అద్భుతమైన బ్యాటింగ్ తో ఇంగ్లాండ్ మీద విండీస్ విజయాన్ని సాధించింది. మూడు మ్యాచ్ ల టెస్ట్ సిరీస్ లో విండీస్ 1-0తో లీడ్ ను సాధించింది. విండీస్ విజయాన్ని పలువురు క్రికెటర్లు పొగుడుతూ ఉన్నారు.

భారత జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ కూడా విండీస్ సాధించిన విజయాన్ని ప్రశంసించాడు. "Wow @windiescricket what a win. Top display of test cricket." అంటూ ట్వీట్ చేశాడు విరాట్.



మొదటి టెస్టు ఆఖరి రోజు 200 పరుగుల టార్గెట్ ను విండీస్ ముందు ఇంగ్లాండ్ ఉంచింది. 27 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి విండీస్ కష్టాల్లో పడింది. జొఫ్రా ఆర్చర్ మొదట్లోనే రెండు వికెట్లు తీయడంతో విండీస్ కష్టాల్లో పడ్డట్టు కనిపించింది. కానీ మిడిల్ ఆర్డర్, లోయర్ ఆర్డర్ అద్భుతంగా రాణించడంతో విండీస్ విజయాన్ని అందుకుంది. విండీస్ విజయానికి 11 పరుగుల దూరంలో ఉన్న సమయంలో బ్లాక్ వుడ్ 95 పరుగుల వద్ద అవుట్ అవ్వడంతో సెంచరీని చేజార్జుకున్నాడు. జొఫ్రా ఆర్చర్ బౌలింగ్ లో రిటైర్డ్ హర్ట్ గా వెనుదిరిగిన జాన్ క్యాంప్బెల్ తిరిగి వచ్చి విజయానికి కావాల్సిన పరుగులను పూర్తీ చేశాడు. విండీస్ జట్టు కెప్టెన్ జేసన్ హోల్డర్ తమ జట్టు ఆటతీరుపై సంతృప్తిని వ్యక్తం చేశారు. తన టెస్ట్ క్రికెట్ కెరీర్ లో ఇదొక బెస్ట్ డే అని చెప్పుకొచ్చాడు. తాము జట్టుగా కలిసికట్టుగా సాధించిన గొప్ప విజయాల్లో ఇదొకటని అన్నాడు.

ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ జట్టు 204 పరుగులు చేసింది. మొట్టి రోజు వర్షం కారణంగా చాలా వరకూ మ్యాచ్ జరగలేదు. విండీస్ మొదటి ఇన్నింగ్స్ లో 318 పరుగులు చేయగా.. ఇంగ్లాండ్ జట్టు రెండో ఇన్నింగ్స్ లో 313 పరుగులు చేసి విండీస్ కు 200 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. విండీస్ ఆరు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేధించింది. షానోన్ గేబ్రియెల్ కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. జులై 16 నుండి ఓల్డ్ ట్రాఫోర్డ్ లో రెండో టెస్టు జరగనుంది.

Next Story