తెవాటియాకు విరాట్‌ కోహ్లీ గిఫ్ట్‌

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  4 Oct 2020 7:52 AM GMT
తెవాటియాకు విరాట్‌ కోహ్లీ గిఫ్ట్‌

కింగ్స్‌ఎలెవన్‌ పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఒకే ఓవర్‌లో ఐదు సిక్సర్లు బాది ఓవర్‌ నైట్‌ స్టార్‌ అయ్యాడు రాజస్థాన్‌ ఆల్‌రౌండర్‌ రాహుల్‌ తెవాటియా. 223పరుగుల భారీ లక్ష్యాన్ని చేదించే క్రమంలో తొలుత నెమ్మదిగా ఆడాడు. 19 బంతుల్లో 8 పరుగులు మాత్రమే చేయడంతో.. ఒకానొక దశలో అందరూ తిట్టుకున్నారు కూడా. ఆ తర్వాత రెచ్చిపోయి ఆడాడు. తరువాత 12 బంతుల్లో 45 పరుగులు చేసి ఔరా అని అనిపించాడు. పంజాబ్‌ బౌలర్‌ కాట్రెల్‌ వేసిన 18 ఓవర్‌లో ఏకంగా ఐదు సిక్సర్లు (6, 6, 6, 6, 0, 6) బాదాడు. దీంతో మ్యాచ్‌ రాజస్థాన్‌ చేతుల్లోకి వచ్చింది. తెవాటియా పేరు మారుమోగిపోయింది.

తెవాటియా ఆటకు అందరూ ఫిదా అయ్యారు. బెంగళూరు కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ కూడా తెవాతియా ఆటకు ముగ్ధుడైయ్యాడు. శనివారం సాయంత్రం రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు, రాజస్థాన్‌ రాయల్స్‌ మధ్య మ్యాచ్‌ జరిగింది. ఈ మ్యాచ్‌ సందర్భంగా తెవాటియాకు విరాట్‌ కోహ్లీ తన జెర్సీని బహూకరించాడు. ఆ జెర్సీపై 'డియర్‌ రాహుల్‌.. బెస్ట్‌ విషెస్‌' రాసి ఆటోగ్రాఫ్ చేసి మరీ ఇచ్చాడు. ఇదిలా ఉంటే.. బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లోనూ తెవాటియా మెరుపు ఇన్నింగ్‌ ఆడాడు. 12 బంతుల్లో 3 సిక్సర్లు బాది 24 పరుగులు చేశాడు. అయినప్పటికి రాజస్థాన్‌ ఓటమిపాలైంది.

టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ చేసిన రాజస్తాన్‌ రాయల్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 154 పరుగులు చేసింది. మహిపాల్‌ లామ్రోర్‌ (39 బంతుల్లో 47; 1 ఫోర్, 3 సిక్స్‌లు) ఆకట్టుకున్నాడు. బట్లర్‌ (12 బంతుల్లో 22; 3 ఫోర్లు, 1 సిక్స్‌), రాహుల్‌ తెవాటియా (12 బంతుల్లో 24; 3 సిక్సర్లు) దూకుడు కనబరిచారు. బెంగళూరు బౌలర్‌ యజువేంద్ర చహల్‌ 3 వికెట్లతో రాణించాడు. చేధన ప్రారంభించిన బెంగళూరు 19.1 ఓవర్లలో 2 వికెట్లకు 158 పరుగులు చేసి విజయాన్ని అందుకుంది. దేవ్‌దత్‌ పడిక్కల్‌ (45 ఓవర్లలో 63; 6 ఫోర్లు, 1 సిక్స్‌) లీగ్‌లో మూడో అర్ధసెంచరీ నమోదు చేయగా.. కెప్టెన్‌ కోహ్లి (53 బంతుల్లో 72 నాటౌట్‌; 7 ఫోర్లు, 2 సిక్సర్లు) మునుపటి ఫామ్‌ను అందుకున్నాడు.

Next Story