స‌త్తా చాటిన‌ ఢిల్లీ

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  4 Oct 2020 3:25 AM GMT
స‌త్తా చాటిన‌ ఢిల్లీ

ఐపీఎల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ మూడో విజయం సాధించింది. ఈ విజ‌యంతో ఢిల్లీ జ‌ట్టు పాయింట్ల పట్టికలో ‘టాప్‌’లోకి వెళ్లింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ 18 పరుగుల తేడాతో కోల్‌కతా నైట్‌రైడర్స్‌పై విజయం సాధించింది. నిర్ణీత‌ 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి ఢిల్లీ 228 పరుగులు చేసింది.

కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యర్‌ (38 బంతుల్లో 88 నాటౌట్‌; 7 ఫోర్లు, 6 సిక్సర్లు) అద్భుత బ్యాటింగ్‌ ప్రదర్శన కనబర్చగా.. పృథ్వీ షా (41 బంతుల్లో 66; 4 ఫోర్లు, 4 సిక్సర్లు), రిషభ్‌ పంత్‌ (17 బంతుల్లో 38; 5 ఫోర్లు, 1 సిక్స్‌) ఆకట్టుకున్నారు. అనంతరం భారీ ల‌క్ష్యంతో చేధ‌న‌కు దిగిన‌ కోల్‌కతా 20 ఓవర్లలో 8 వికెట్లకు 210 పరుగులు చేసింది. కోల్‌కతా జ‌ట్టులో నితీశ్‌ రాణా (35 బంతుల్లో 58; 4 ఫోర్లు, 4 సిక్సర్లు) అర్ధ సెంచరీ చేయగా.. ఇయాన్‌ మోర్గాన్‌ (18 బంతుల్లో 44; 1 ఫోర్, 5 సిక్సర్లు), రాహుల్‌ త్రిపాఠి (16 బంతుల్లో 36; 3 ఫోర్లు, 3 సిక్సర్లు) మెరిపించారు.

అయితే గెలుపు అంచుల వ‌ర‌కూ వ‌చ్చిన కోల్‌క‌తాకు చివరి నాలుగు ఓవర్లలో 77 పరుగులు అవసరం. ఈ దశలో ఎవరి అంచనాలో లేని రాహుల్‌ త్రిపాఠి 17వ ఓవర్‌లో 6,6,4,6తో బెంబేలెత్తించి 24 పరుగులు పిండుకోగా, రబాడ ఓవర్‌లో మోర్గాన్‌ హ్యాట్రిక్‌ సిక్సర్లతో హోరెత్తించి 23 పరుగులు రాబట్టాడు.

దీంతో ల‌క్ష్యం ఒక్కసారిగా 12 బంతుల్లో 31కి మారింది. కానీ 19వ ఓవర్‌లో మోర్గాన్‌ వికెట్‌ తీసిన నోకియా 5 పరుగులే ఇచ్చి మ్యాచ్‌ను మలుపు తిప్పాడు. ఇక ఆఖరి ఓవర్‌లో 26 పరుగులు కావాల్సి ఉన్నా త్రిపాఠిని స్టొయినిస్‌ బౌల్డ్‌ చేయడంతో కేకేఆర్ ఓటమిని మూట‌గ‌ట్టుకోక త‌ప్ప‌లేదు.

Next Story