రాణించిన కోహ్లీ.. ఆర్సీబీ ఘ‌న‌విజ‌యం

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  3 Oct 2020 2:25 PM GMT
రాణించిన కోహ్లీ.. ఆర్సీబీ ఘ‌న‌విజ‌యం

రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు ఘన విజయం సాధించింది. రాజస్థాన్ నిర్దేశించిన 155 పరుగుల విజయ లక్ష్యాన్ని మరో 5 బంతులు మిగిలి ఉండగానే ఛేదించింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 154 పరుగులు మాత్రమే చేసింది.

బ్యాట్స్‌మెన్ అనవసర షాట్లకు పోయి చేజేతులా వికెట్లు చేజార్జుకున్నారు. ఆల్‌రౌండ‌ర్‌ లోమ్రోర్ 47 పరుగులు చేయడంతో రాజస్థాన్ ఆ మాత్రం పరుగులైనా చేయగలిగింది. జోస్ బట్లర్ 22, రాహుల్ తెవాటియా 24 పరుగులు చేయ‌గా.. కెప్టెన్ స్మిత్ 5, శాంసన్ 4, ఉతప్ప 17, రియాన్ పరాగ్ 16, జోఫ్రా అర్చర్ 16 విఫ‌ల‌మ‌య్యారు.

155 పరుగుల విజయ లక్ష్యంతో బ‌రిలోకి దిగిన బెంగళూరు జ‌ట్టులో ఓపెనర్ దేవదత్ పడిక్కల్ మరో మారు అర్ధ సెంచరీతో మెరిశాడు. 45 బంతుల్లో 6 ఫోర్లు, సిక్సర్ సాయంతో 63 పరుగులు చేయగా, వ‌రుస‌గా విఫ‌ల‌మ‌వుతూ వ‌స్తున్న‌ కోహ్లీ ఈ మ్యాచ్‌లో జాగ్రత్తగా ఆడాడు. అనవసర షాట్లకు పోకుండా చెత్త బంతులను బౌండరీలకు తరలించాడు. 53 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్సర్లతో 72 పరుగులు చేశాడు. ఈ గెలుపుతో బెంగళూరు 6 పాయింట్లతో అగ్రస్థానానికి చేరుకుంది.

Next Story